Silver Jewellery: వెండి వస్తువులు లేదా ఆభరణాలను ఎక్కువ కాలం గాలి తగిలేలా వదిలేస్తే అవి క్రమంగా నల్లగా మారుతుంటాయి. గాలిలోని సల్ఫర్ వెండితో చర్య జరపడం వల్ల ఇలా జరుగుతుంది. వెండిపై పేరుకుపోయిన ఈ నలుపును వదిలించడానికి ప్రతిసారీ కంసాలి వద్దకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ప్రముఖ షెఫ్ పంకజ్ భౌదూరియా సూచించిన కొన్ని సులభమైన చిట్కాల ద్వారా ఇంట్లోనే వెండిని ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వెండి నలుపును వదిలించడం ఎలా?
షెఫ్ పంకజ్ ప్రకారం.. బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ సహాయంతో వెండిని సులభంగా శుభ్రం చేయవచ్చు. దీని కోసం మీకు ఒక గాజు గిన్నె కూడా అవసరమవుతుంది.
ఎలా చేయాలి?
మొదట ఒక గాజు గిన్నెను తీసుకుని అందులో శుభ్రం చేయాల్సిన వెండి ఆభరణాలను ఉంచండి. ఇప్పుడు ఆ గిన్నె పరిమాణంలో ఉండే ఒక అల్యూమినియం ఫాయిల్‌ను తీసుకుని గిన్నె లోపలి భాగంలో అమర్చండి. ఆపై గిన్నెలో వేడి నీటిని పోసి, పైన బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. ఇప్పుడు వెండి ఆభరణాలను ఆ నీటిలో వేసి దాదాపు ఒక గంట పాటు అలాగే వదిలేయండి. ఇలా చేయడం వల్ల వెండిపై ఉన్న నలుపు సులభంగా తొలగిపోయి మెరుస్తుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించవచ్చు.
ఇతర ప్రత్యామ్నాయాలు
- బేకింగ్ సోడా అందుబాటులో లేకపోతే ఉప్పును కూడా వాడవచ్చు.
- నీటిలో నిమ్మరసం కలపడం వల్ల ఆభరణాలకు ప్రత్యేకమైన మెరుపు వస్తుంది.
- వెండి ఆభరణాలను వినెగార్ కలిపిన నీటిలో ఉంచడం ద్వారా కూడా శుభ్రం చేయవచ్చు.
- ఎప్పుడూ వేడి నీటినే వాడాలి. ఎందుకంటే చల్లటి నీరు మురికిని అంత త్వరగా వదిలించదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వెండి ఆభరణాలను ఎప్పుడూ గట్టిగా రుద్ది శుభ్రం చేయవద్దు. దీనివల్ల వాటిపై గీతలు పడే అవకాశం ఉంది.
- ఆభరణాలను తూడవడానికి ఎప్పుడూ మెత్తటి గుడ్డను మాత్రమే ఉపయోగించండి.
- ఆభరణాలను మరీ ఎక్కువ సేపు నీటిలో నానబెట్టకండి. ఇది వాటి మెరుపును దెబ్బతీస్తుంది.
