Parenting Tips : పిల్లల ముందు బాధపడితే…ఏం జరుగుతుందో తెలుసా..?

అమ్మ...అనురాగంలోని మొదటి అక్షరాన్ని...మమకారంలోని మొదటి రెండక్షరాల్ని పెవేసే బంధం. అమ్మంటే అద్భుతం, ఆత్మీయత, అనురాగం, అనుబంధం.

  • Written By:
  • Updated On - April 29, 2022 / 11:49 AM IST

అమ్మ…అనురాగంలోని మొదటి అక్షరాన్ని…మమకారంలోని మొదటి రెండక్షరాల్ని పెవేసే బంధం. అమ్మంటే అద్భుతం, ఆత్మీయత, అనురాగం, అనుబంధం. పిల్లలకు అమ్మే రోల్ మోడల్. ఏ సమస్య వచ్చినా సరే అమ్మకు చెబితే చాలు…పరిష్కారం అవుతుందని పిల్లల నమ్మకం. మరి అలాంటి అమ్మం కష్టాలు ఎదురవుతాయి..కన్నీళ్లు వస్తాయని చిన్న పిల్లలకు తెలియదు. అందుకే ఆ కన్నీటిని పిల్లలకు కనపడకుండా తల్లి జాగ్రత్త పడుతుంది. ప్రతిసారీ పరిస్థితి అమ్మ ఆధీనంలో ఉండదు. కొన్ని సందర్భాల్లో పిల్లలున్నారన్న సంగతి మర్చిపోయి…వాళ్ల ముందే తన కోపాన్ని, బాధను వ్యక్తపరుస్తుంటుంది. కన్నీళ్లు కారుస్తుంది. కన్నతల్లి ఏడుస్తుంటే…ఏ బిడ్డ మనసైనా తల్లడిల్లుతుంది. ఏం చెప్పి అమ్మను ఓదార్చాలో ఆ పిల్లలకు తెలియదు. అందుకే అలాంటి పరిస్థితుల్లో తల్లి ఎలా ప్రవర్తించాలి. పిల్లల మనస్సు బాధపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇప్పుడు తెలుసుకుందాం.

డైరీ రాయండి..
మీకు డైరీ రాసే అలవాటు ఉన్నట్లయితే…మీరు కోపంలో, బాధలో ఉన్నప్పుడు మీ మనసులోని ఆలోచనలో కాగితంపై రాయండి. మీకు డైరీ రాసే అలవాటు లేకపోతే…రాసేందుకు ప్రయత్నించండి. దీనివల్ల వేరే వ్యక్తితో కాకుండా మీతో మీరే మాట్లాడుకున్నట్లు ఉంటుంది. ఇలా చేస్తే మీకు పరిష్కార మార్గాలు కూడా సులభంగా దొరుకుతాయి. అంతేకాకుండా మీరు రోజూ చేయాలనుకునే పనులను కూడా ఒక కాగితం మీద రాసి ఉంచుకోండి. బాధలో ఉన్నప్పుడు అన్ని విషయాలు జ్ఞాపకం ఉండవు కదా. ఇలా రాసి ఉంచితే వాటిని మర్చిపోకుండా అనుకున్న సమయానికే పూర్తి చేయడానికి సులభంగా ఉంటుంది.

మీతో మీరు మాట్లాడుకోండి..
మీకు మీరే స్నేహితురాలు. మీకు మిమ్మల్ని మించిన స్నేహితురాలు దొరకదు. మీ ఆవేశాన్ని, ఆలోచనలను, బాధను ముందు మీతో మీరే షేర్ చేసుకోండి. మీ పరిస్థితి గురించి అందరికంటే ఎక్కువగా మీకే తెలుస్తుంది. బాగా ఆలోచించిన తర్వాతే తగిన నిర్ణయాలు తీసుకోండి. కోపం, బాధ నుంచి వీలైనంత త్వరగా తిరిగి మామూలు స్థితికి వచ్చేందుకు ప్రయత్నించండి. ఈ క్రమంలో మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా…క్రమంగా పెరుగుతుంది. సమస్యలు ఎలాంటివైనా సరే మీ అంతట మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా ప్లాన్ చేసుకోండి.

ఇతరులతో పంచుకోండి..
మీరు తట్టుకోలేని కోపం, బాధ వచ్చినప్పుడు.. వాటిని పిల్లల ముందు ప్రదర్శించకూడదు. మీ సన్నిహితులతోకానీ, మీ శ్రేయోభిలాషులతో కానీ పంచుకోండి. వాళ్లు మీ భర్త, అమ్మ, స్నేహితుడు, స్నేహితురాలు, పక్కింటి వాళ్లు..ఎవరైనా కావొచ్చు. వాళ్లతో మీ బాధలను వ్యక్తపరచుకోండి. సలహాలు తీసుకోండి. ఎందుకంటే ఎంత పెద్ద బాధైనా సరే ఇతరులతో పంచుకుంటే కాస్త తగ్గిపోతుంది. అలా మీరు మామూలు స్థితికి వచ్చాక యథాతథంగా మళ్లీ పిల్లలతో కలవండి.

చిన్న పిల్లలైతే..
మీకు విపరీతమైన ఆవేశం, బాధ వచ్చినప్పుడు.. వాటిని మీ పిల్లల ముందు వ్యక్తపరచకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు వేరే గదిలోకి వెళ్లడం.. లేదా వాళ్లనే వేరే గదికి పంపించడం చేయండి. ఇలా చేస్తే మీ బాధ గురించి వాళ్లకు తెలిసే అవకాశం ఉండదు. ముఖ్యంగా చిన్న పిల్లలు తమ తల్లి ఏడుస్తూ, బాధపడుతూ కనిపిస్తే చూసి అస్సలు తట్టుకోలేరు. వాళ్ల మనసులో ఆ సంఘటన చాలా కాలం వరకు అలాగే గుర్తుండిపోతుంది. వారిని కూడా మానసికంగా బాధపెట్టివాళ్లం అవుతాం.

పెద్ద పిల్లల విషయంలో..
కొన్ని విషయాలు పిల్లల ముందు దాయడం కన్నా.. వాటి గురించి వాళ్లకు అర్థం అయ్యే విధంగా వివరిస్తేనే మేలు. ఇలా చేస్తే మీరు మీ పిల్లల ముందు కన్నీళ్లు పెట్టుకున్నా, ఆవేశాన్ని ప్రదర్శించినా.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో పిల్లలకు వివరించండి. ముఖ్యంగా కొంచెం పెద్ద పిల్లల విషయంలో.. నిజాలను దాచిపెట్టొద్దు. ఎందుకంటే ఆ విషయాన్నివాళ్లు వారికి తోచిన విధంగా అర్ధం చేసుకుంటారు. తద్వారా.. వాళ్లే ఓ అభిప్రాయానికొచ్చే అవకాశముంది. దానికంటే మీరే వాళ్లకు జరిగిన నిజాలను వివరించడం మంచిది. ఇలా చేస్తే ‘అమ్మ’కు కూడా కోపం, బాధ, కన్నీళ్లు, ఆవేశం.. అనే భావాలుంటాయని వాళ్లు కూడా అర్థం చేసుకుంటారు.