Under Eye Skin Care: “డార్క్ సర్కిల్స్” కు చెక్ పెట్టే బ్రైట్ సీక్రెట్స్!!

మీ రెండు కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ ను మీ జీవన విధానానికి, మీ ఆరోగ్యానికి సూచికలుగా చెప్పొచ్చు.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 08:30 AM IST

మీ కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయా?

రోజూ అద్దంలో వాటిని చూసుకుంటూ బాధపడుతున్నారా?

అయితే ఈ కథనం మీకోసమే!!

మీ రెండు కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ ను మీ జీవన విధానానికి, మీ ఆరోగ్యానికి సూచికలుగా చెప్పొచ్చు.

కంటి నిండా నిద్రపోకపోవడం, వేళకు ఆహారం తీసుకోకపోవటం, అనారోగ్యకర జీవన విధానం, దీర్ఘకాలం పాటు ఉన్న అనారోగ్యం, స్కిన్ అలర్జీలు, మూత్రపిండాలు లేదా అడ్రినల్ అసమతుల్యతలు, జన్యుపరమైన కారణాల వల్ల ఈ డార్క్ సర్కిల్స్ వస్తాయి. కారణం ఏదైనా కావచ్చు.. ఇవి మీ ముఖాన్ని అందవిహీనం చేస్తాయి. వృద్ధాప్య సంకేతాలను చూపిస్తాయి.

కంటి చుట్టూ ఉండే చర్మం సున్నితం

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ పొగోట్టుకునేందుకు చికిత్స ప్రారంభించే ముందు కొన్ని వాస్తవాల గురించి మీరు తెలుసుకోవాలి. కంటి చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దీనిపై ఎలాంటి రాపిడి తగిలినా ఆ చర్మం కందిపోతుంది. కంటి చుట్టూ ఉండే చర్మం పత్తి లాంటిది అయితే మిగతా శరీర భాగాల్లోని చర్మం డెనిమ్ లాంటిది. మీరు కాటన్, సిల్క్, నైలాన్ దుస్తులను వేర్వేరు పద్ధతుల్లో ఉతికినట్లే.. కంటి చుట్టూ ఉండే చర్మం, మిగతా భాగాల్లోని చర్మం కూడా వేర్వేరుగా ఉంటుందని గ్రహించాలి. తద్వారా మనం చర్మ సంరక్షణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ధూమపానం, మద్యపానం..

ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు కూడా నల్లటి వలయాలకు దారితీస్తాయని చర్మ వైద్యులు వెల్లడించారు. ఆల్కహాల్ తాగడం వల్ల కళ్ల కింద రక్తనాళాలు కుచించుకుపోతాయని, తద్వారా నల్లటి వలయాలు మరింత కనిపిస్తాయని పేర్కొన్నారు. ఆల్కహాల్ నిద్రను కూడా ప్రభావితం చేస్తుందని, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడే సమస్య తీవ్రతరం అవుతుందని తెలిపారు.

సింపుల్ చిట్కాలు

* రోజూ కంటి నిండా నిద్రపోండి.

* నీళ్లు బాగా తాగండి.

* సీ విటమిన్ ఉన్న పండ్లు తినండి.

* వంటల్లో కూరగాయల వినియోగం పెంచండి.

* కంటి కింద సాఫ్ట్ గా మసాజ్ చేయించండి. ఫలితంగా ఆ భాగంలో రక్త ప్రసరణ పెరిగి డార్క్ సర్కిల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది.

* కంటి కింది భాగంలో చర్మం పై పెట్టేందుకు నాణ్యమైన మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, లోషన్స్ వాడండి.

* కీర దోసను ముక్కలుగా కట్‌ చేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత వాటిని పావుగంట పాటు కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు తగిన విశ్రాంతి లభిస్తుంది. నల్లటి వలయాలు నెమ్మదిగా దూరమవుతాయి.

* సాధారణంగా అలొవెరా అందరి ఇళ్లలో ఉంటుంది. అలొవెరాను కొద్దిగా కట్‌ చేసి జెల్‌ను కళ్ల కింద భాగంలో రాయాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు పోయేందుకు అలొవెరా ఎంతగానో ఉపయోగపడుతుంది.

* టమోటాను కట్‌ చేసి ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. పావుగంట పాటు అలా వదిలేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక టీస్పూన్‌ టమోటా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి కళ్ల కింద అప్లై చేసినా ఫలితం కనిపిస్తుంది.

* గ్రీన్‌టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్‌ డార్క్‌ సర్కిల్స్‌ను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. గ్రీన్‌ టీ తయారు చేసుకున్నాక ఆ టీ బ్యాగ్‌ని పడేయకుండా ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లటి టీ బ్యాగ్‌ని కళ్లపై పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

* బంగాళదుంపను గుజ్జుగా చేసి, ఆ గుజ్జును కళ్లపై పావుగంట పాటు ఉంచితే చాలు మంచి ఫలితం ఉంటుంది. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే కళ్ల కింద నల్లటి వలయాలు దూరమవుతాయి.

* కొద్దిగా దూది తీసుకుని రోజ్‌ వాటర్‌లో ముంచి కళ్లపై పెట్టుకోవాలి. పావుగంట పాటు ఇలా చేయడం వల్ల కళ్లు రీఫ్రెష్‌ అవుతాయి. దీంతో నల్లటి వలయాలు పోతాయి.