Jowar Idli Recipe : ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే జొన్న ఇడ్లీలు.. కొబ్బరి చట్నీతో తింటే సూపరంతే..

జొన్నలతో ఇలా ఇడ్లీ చేసుకుని తింటే.. ఆరోగ్యానికి చాలా మంచిది. చిరుధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. వీటిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని తింటే.. రోజంతా చురుకుగా ఉంటారు.

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 08:17 PM IST

Jowar Idli Recipe : ఇప్పుడు మనిషి జీవనశైలి గురించి చెప్పుకోవాలంటే.. కరోనాకి ముందు.. కరోనా తర్వాతనే చెప్పాలి. కరోనా రాకముందు ఏదిపడితే అది తినేవారంతా.. కరోనా వచ్చివెళ్లాక ఆరోగ్యంపై శ్రద్ధపెడుతున్నారు. ఫిట్ గా ఉండాలని తపన పడుతున్నారు. జిమ్, వర్కవుట్స్, వాకింగ్ వంటివి అలవాటు చేసుకున్నారు. తినే ఆహారం కూడా మితంగా తీసుకుంటున్నారు. బ్రౌన్ రైస్, చిరుధాన్యాలు ఆహారంలో భాగమయ్యాయి.

ఉదయాన్నే తినే అల్పాహారం కూడా హెల్దీగా తయారు చేసుకుంటున్నారు. సాధారణంగా తినే ఇడ్లీల్లో కార్బొహైడ్రేట్లు అధికం. అందుకే ఇడ్లీలు కూడా మిల్లెట్స్ , ఓట్స్ తో తయారు చేస్తున్నారు. అలాగే ఒకసారి జొన్నలతో ఇడ్లీ చేసుకుని తినండి. మెత్తగా, రుచిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్ కూడా. మరి జొన్న ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలి ? అందుకు ఏయే పదార్థాలు కావాలి ? చూద్దాం.

జొన్న ఇడ్లీ రెసిపీకి కావలసిన పదార్థాలు

జొన్నరవ్వ – 3 కప్పులు

మినపప్పు – 1 కప్పు

నీరు – కావలసినంత

ఉప్పు – రుచికి సరిపడా

జొన్న ఇడ్లీ తయారీ విధానం

మినపప్పును శుభ్రంగా కడిగి 6 గంటల సమయం నానబెట్టుకోవాలి. జొన్న రవ్వను కూడా 6 గంటలపాటు నానబెట్టుకోవాలి.

ఇప్పుడు మినపప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పిండిలో జొన్నరవ్వ వేసి బాగా కలిసేలా కలుపుకుని.. రాత్రంతా మూతపెట్టుకుని ఉంచుకోవాలి.

ఉదయాన్నే ఈ పిండిలో ఉప్పును కలుపుకుని.. ఇడ్లీ కుక్కర్లో జొన్న ఇడ్లీలను పెట్టుకోవాలి. అంతే.. పావుగంటలో జొన్న ఇడ్లీలు రెడీ.

ఈ జొన్న ఇడ్లీలను ఏ చట్నీతో తిన్నా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా టమోటా చట్నీ, కొబ్బరి చట్నీ మంచిరుచిని ఇస్తాయి.

జొన్నలతో ఇలా ఇడ్లీ చేసుకుని తింటే.. ఆరోగ్యానికి చాలా మంచిది. చిరుధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. వీటిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని తింటే.. రోజంతా చురుకుగా ఉంటారు. త్వరగా నీరసం రాకుండా ఉంటుంది. అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వీటిలో ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ బి, కాపర్, క్యాల్షియం అధికంగా ఉంటాయి.

Also Read : Insomnia: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?