మామూలుగా మనం పచ్చి బఠానీ తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. ప్రత్యేకించి పచ్చిబఠానీలతో కొన్ని రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా పచ్చి బఠానీ చీజ్ కట్లెట్ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ సింపుల్ రెసిపీ ని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు :
పచ్చి బఠానీలు – ఒక కప్పు
బంగాళాదుంప – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
చీజ్ క్యూబ్స్ – 100 గ్రాములు
ఉప్పు – తగినంత
వెల్లుల్లి – అయిదు రెబ్బలు
బ్రెడ్ పొడి – నాలుగు స్పూన్లు
ఆలివ్ నూనె – రెండు స్పూన్లు
జీలకర్ర పొడి – పావు స్పూను
మ్యాంగో పొడి – అర స్పూను
యాలకుల పొడి – పావు స్పూను
తయారీ విధానం.
అయితే ఇందుకోసం ఒక కడాయి తీసుకొని ఒక స్పూను నూనె వేయాలి. అది వేడెక్కాక వెల్లుల్లి రెబ్బల తురుము, పచ్చిమిర్చి తురుము వేసి వేయించాలి. అందులో బఠానీలు వేసి బాగా కలపాలి. అందులో ఉప్పు, యాలకుల పొడి వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఉడికాక స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలోకి బఠానీల మిశ్రమాన్ని తీసి పెట్టుకోవాలి. అందులో ఉడికించిన బంగాళాదుంపలను చేత్తో మెత్తగా మెదిపి బఠానీలతో కలపాలి. అందులో జీలకర్ర పొడి, బ్రెడ్ పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దలోంచి చిన్న ముద్ద తీసి మధ్యలో చీజ్ ముక్క పెట్టి మళ్లీ గుండ్రంగా చుట్టేయాలి. ఆ గుండ్రని ఉండని చేత్తో కట్‌లెట్‌లా ఒత్తుకోవాలి. అలా అన్నీ ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్ లో ఒక స్పూను నూనె వేయాలి. కట్‌లెట్‌లను నూనెపై ఉండి రెండు వైపులా వేయించాలి. బ్రౌన్ రంగులోకి మారే వరకు ఫ్రై చేయాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీ చీజ్ కట్లెట్ రెడీ.