Site icon HashtagU Telugu

Gongura Fish Pulusu : చేపల పులుసు.. గోంగూరతో ఇలా వండితే లొట్టలేసుకుంటూ తింటారు మరి !

gongura chepala pulusu

gongura chepala pulusu

ఆదివారం వచ్చిందంటే.. నాన్ వెజ్ ప్రియులకు పండగే. అంటే కేవలం ఆదివారమే నాన్ వెజ్ తింటారని కాదు. మిగతా రోజుల్లో తిన్నా.. ఆఫీస్ వర్క్ చేస్తూనో, ఇతర పనులకు వెళ్లొచ్చో.. ఆ ఎంజాయ్ మెంట్ మిస్ అవుతారు. అదే ఆదివారం అయితే రెస్ట్ డే. ఎంచక్కా ఇంట్లోనే నచ్చింది వండుకుని తినొచ్చు. ఇక సండే అంటే.. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పీతలు.. ఇలా రకరకాల నాన్ వెజ్ వంటలు చేసుకుని తింటారు. చింతపండు పులుసుతో చేపల పులుసు చాలాసార్లు తినే ఉంటారు కదూ. ఫర్ ఏ చేంజ్.. గోంగూరతో చేపల పులుసు ట్రై చేయండి. ఇలా వండితే.. మీ చేపల పులుసును లొట్టలేసుకుంటూ తినేస్తారు.

గోంగూర – చేపలపులుసు తయారీకి కావలసిన పదార్థాలు

చేపలు – 1 కిలో

గోంగూర – 1 కట్ట పెద్దది

పసుపు – 1/4 టీ స్పూన్

అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్

కారం – 3 స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

జీలకర్ర – 1 స్పూన్

ఆవాలు – 1 స్పూన్

ఎండుమిర్చి – 3

ధనియాల పొడి – టీ స్పూన్

ఉల్లిపాయ – 1

మెంతిపిండి – 1/2 స్పూన్

గరం మసాలా – 1 స్పూన్

టమాటాలు – 2

నీరు – కూరకు కావలసినంత

నూనె – తగినంత

కొత్తిమీర తరుగు -3 టేబుల్ స్పూన్లు

గోంగూర – చేపలపులుసు తయారీ విధానం

ముందుగా చేప ముక్కల్ని ఒక గిన్నెలో వేసి శుభ్రం చేసుకోవాలి. ఇందులోనే పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టి మూతపెట్టి 1 గంట ఉంచుకోవాలి. అప్పుడే ఉప్పు, కారం చేప ముక్కలకు పట్టి.. టేస్ట్ వస్తుంది.

ఇప్పుడు స్టవ్ పై కూరకు కావలసిన గిన్నెను పెట్టి చేపలను వేయించేందుకు సరిపడా నూనె వేసుకోవాలి. అందులో ఒక్కో చేప ముక్కను ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

అదే గిన్నెలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకున్నాక.. ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. గోంగూరను శుభ్రం చేసి.. చిన్నగా తరిగి వేసి బాగా కలుపుకుని మూత పెట్టాలి.

గోంగూర మగ్గాక.. పసుపు, కారం, మెంతిపొడి, ధనియాలపొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలుపుకోవాలి. టమాటా ప్యూరీని కూడా వేసి అరగంట పాటు ఉడకనివ్వాలి.

నూనె పైకి తేలుతుందనగా నీళ్లు పోసి.. పులుసు వచ్చేలా మరగనివ్వాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి పావుగంటపాటు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే.. గోంగూర చేపలపులుసు రెడీ. గోంగూర పుల్లగా లేకపోతే కాసింత చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ ప్రియులకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేయండి.