Site icon HashtagU Telugu

Gongura Chicken: గోంగూర చికెన్ కర్రీ.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని మరి తినేయాల్సిందే?

Mixcollage 14 Feb 2024 11 11 Pm 3618

Mixcollage 14 Feb 2024 11 11 Pm 3618

మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటాం. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ కబాబ్, చికెన్ మసాలా కర్రీ ఇలా ఇంకా ఎన్నో రకాల కర్రీలను ట్రై చేసే ఉంటాం. అయితే ఎప్పుడైనా గోంగూర చికెన్ కర్రీ తిన్నారా. ఒకవేళ ఎప్పుడు తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

చికెన్ – అరకేజి
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 3
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
పసుపు – చిటికెడు
గోంగూర ఆకులు – 100 గ్రాములు
కొత్తిమీర – 1 కట్ట
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి తగినంత

తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా గోంగూర ఆకులను బాగా కడగాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపై పాన్ ఉంచి దానిలో గోంగూర వేయాలి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలిపి మగ్గనివ్వాలి. దానిలోని నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు గోంగూరను మగ్గనివ్వాలి. తర్వాత దానిని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపై ఒక కడాయి ఉంచాలి. మంటను మీడియం సైజ్​లో ఉంచి కడాయిలో కాస్త నూనె వేసి వేడి చేయాలి. దానిలో ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. దానిలో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా కడిగిన చికెన్​ను దానిలో వేసి మగ్గనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత దానిలో కారం, ఉప్పువేసి బాగా కలపండి. దానిపై మూత ఉంచి మరో 10 నిముషాలు మగ్గనివ్వాలి. తర్వాత దానిలో కొంచెం నీరు వేసి బాగా కలపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర పేస్ట్​ని వేసి దానిలో బాగా కలపాలి. మరో రెండు నిమిషాలు గోంగూరతో ఉడికించి కొత్తిమీర వేస్తే సరి.