Goat Head Curry: తలకాయ కూరను ఇలా వండితే లొట్టలు వేసుకొని మరీ తినేయాల్సిందే?

నాన్ వెజ్ రెసిపీలలో ఎక్కువ శాతం మంది ఇష్టపడే రెసిపీ తలకాయ కూర. చాలామంది ఇందులో ఎముకలు ఉంటాయని ఇష్టపడరు కొందరు మాత్రం ఈ తలకాయa

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 11:22 PM IST

నాన్ వెజ్ రెసిపీలలో ఎక్కువ శాతం మంది ఇష్టపడే రెసిపీ తలకాయ కూర. చాలామంది ఇందులో ఎముకలు ఉంటాయని ఇష్టపడరు. కొందరు మాత్రం ఈ తలకాయ రెసిపీని ఇష్టంగా తినేస్తూ ఉంటారు. కాగా నిజానికి దీన్ని వండడం చాలా సులువు. కాకపోతే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. మాంసం ఉడకడానికి ఆ మాత్రం సమయం అవసరం. సింపుల్‌గా ఈ కూర ఎలా వండాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

తలకాయ మాంసం – అర కిలో
ఉల్లిపాయ – ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూను
కొత్తి మీర – ఒక కట్ట
మిరియాల పొడి – అర స్పూను
గరం మసాలా – ఒక టీస్పూను
ధనియాల పొడి – ఒక టీస్పూను
కారం – ఒక టీస్పూను
పసుపు – పావు స్పూను
జీలకర్ర – పావు స్పూను
కొబ్బరి తురుము – ఒక స్పూను

తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా తలకాయ మాంసాన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి రెండు చెంచాల నూనె వెయ్యాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయల తరుగును వేసి వేయించాలి. ఉల్లిపాయ కాస్త బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాక, అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది. ఆ సమయంలో పసుపు, కారం కూడా వేసి వేయించాలి. ఇవన్నీ వేగాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసం ముక్కలు వేసి వేయించాలి. ఉప్పు వేయాలి. మూత పెట్టి చిన్న మంట మీద ఉడికిస్తే మాంసంలోని నీళ్లు దిగి కాసేపు ఉడుకుతుంది. నీళ్లు ఇంకిపోయి అనుకున్నప్పుడు కొన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి, విజిల్ పెట్టేయాలి. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత కూరను కళాయిలోకి మార్చుకుని మళ్లీ చిన్న మంటపై ఉడికించాలి. కడాయిలో ఉడుకుతున్నప్పుడు మిరియాల పొడి, గరం మసాలా, కొబ్బరి తురుము, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. దించే ముందు కొత్తి మీర తురుము వేసి స్టవ్ కట్టేయాలి. దీన్ని అన్నంతో పాటే కాదు, రోటి, రాగి సంగటి, చపాతీలతో లాగించవచ్చు.