Refrigerated Food: ఫ్రిజ్‌లో ఫుడ్స్ ఎన్నిరోజులు నిల్వ చేయొచ్చు? మీరు ఫుడ్ ఐటమ్స్ ను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతారా..?

నేటి బిజీ లైఫ్ స్టైల్ లో ఆహారాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకుని తినడం సర్వసాధారణమై పోయింది. దీనివల్ల ఆహారం పాడు కాదు.. సమయం కూడా ఆదా అవుతుంది. ఇక్కడి దాకా అంతా ఓకే.. కానీ ఆరోగ్యానికి ఇబ్బంది రాకూడదు అంటే గరిష్టంగా ఎంత టైం పాటు ఫుడ్ ను ఫ్రిజ్ లో నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

  • Written By:
  • Updated On - February 5, 2023 / 11:34 AM IST

నేటి బిజీ లైఫ్ స్టైల్ లో ఆహారాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకుని తినడం సర్వసాధారణమై పోయింది. దీనివల్ల ఆహారం పాడు కాదు.. సమయం కూడా ఆదా అవుతుంది. ఇక్కడి దాకా అంతా ఓకే.. కానీ ఆరోగ్యానికి ఇబ్బంది రాకూడదు అంటే గరిష్టంగా ఎంత టైం పాటు ఫుడ్ ను ఫ్రిజ్ లో నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

ఫ్రిజ్‌లో ఎక్కువసేపు నిల్వ ఉంచిన ఆహారం ఆరోగ్యానికి మంచిదా ? కాదా? అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది.నేటి వేగవంతమైన జీవనశైలి కారణంగా చాలామందికి ప్రతిరోజూ తాజా ఆహారాన్ని వండడం కష్టంగా మారింది. దీని కారణంగా ప్రజలు తరచుగా ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారాన్ని తయారు చేస్తారు. తిన్నాక మిగిలిన ఫుడ్ ను.. తరువాత ఉపయోగం కోసం రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తారు. కానీ చాలా మంది ఆరోగ్య నిపుణులు వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచకూడదని సలహా ఇస్తున్నారు.  ఆహారం ఫ్రిజ్‌లో ఉంచితే పోషకాలు కోల్పోతాయనే అపోహ ప్రజల్లో ఉంది. వాస్తవానికి వంట చేసే సమయంలోనే ఆహారంలోని అనేక పోషకాలు నశిస్తాయి. నీటిలో కరిగే విటమిన్లు అత్యంత అస్థిరమైన , సులభంగా నశించే రకానికి చెందిన పోషకాలు. కానీ వాటిలో చాలావరకు నష్టం వంట సమయంలోనే జరుగుతుంది.

శీతలీకరణ సమయంలో కానే కాదు. నిజానికి వంట సమయంలో పుట్టే వేడి అనేది ఫుడ్స్ లోని విటమిన్లను నాశనం చేస్తుంది. ఫ్రిజ్ లోని కూల్ వల్ల ఆ నష్టం జరగదు. వండిన ఫుడ్ గాలి చొరబడని కంటైనర్‌లో కనీసం రెండు నుంచి మూడు రోజులు.. చాలా సందర్భాలలో ఒక వారం వరకు నిల్వ ఉంటుంది. ఫ్రీజర్‌లో ఉంచిన అనేక ఫుడ్స్ ఆరు నెలల వరకు నిల్వ(పవర్ కట్ లేకపోతే) ఉంటాయి. ఫ్రిజ్ లోని చల్లటి వాతావరణం వల్ల ఫుడ్స్ లోని అన్ని జీవసంబంధ కార్యకలాపాలు మందగిస్తాయి. కాబట్టి ఆహారం చెడిపోయే అవకాశం తగ్గిపోతుంది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.  కొన్ని బ్యాక్టీరియాలు సాదా వండిన/ఉడికించిన అన్నంలో బాగా వృద్ధి చెందుతాయి. ఇవి తక్కువ ఉష్ణోగ్రతలో కూడా బాగా యాక్టివ్ గా జీవించగలవు. అందుకే వాటిని వండిన తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే తీసుకోవడం మంచిది.

Also Read: Heart Attack: నిద్రలో గుండెపోటు వచ్చే ముప్పు.. బీ అలర్ట్..!

ఇండియా ఫుడ్ ఫ్రిజ్ ఫ్రెండ్లీ

భారతీయ ఆహారంలో మసాలాలు, ఉప్పు, పులుపు కూడా ఉంటాయి. కాబట్టి అది స్వతహాగా ఫ్రిజ్-ఫ్రెండ్లీగా మారుతుంది. మాంసాహారం, పౌల్ట్రీ, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి పాడైపోయే ఆహారాలను రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ రోజులు ఉంచొచ్చు. అయితే ఫ్రిజ్ లో గడ్డకట్టిన ఆహారాన్ని దీర్ఘకాలం ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటారు. ఇక రొట్టె, పండ్లు వంటివి ఫ్రిజ్ లో ఉంచాక కొన్ని రోజులలోపే ఉపయోగించాలి.ఇక కూర గాయలైతే ఎక్కువ కాలం ఫ్రిజ్ లో నిల్వ ఉంటాయి.

మూడు, నాలుగు రోజుల తర్వాత ఏమవుతుందంటే..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూడు, నాలుగు రోజుల తర్వాత ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.  దీనివల్ల ఆహారంలో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. బ్యాక్టీరియా అనేది సాధారణంగా ఆహారం యొక్క రుచి, వాసన, రంగును మార్చదు. దీని కారణంగా ఆహారం సురక్షితంగా ఉందో లేదో కూడా మీరు తెలుసుకోలేరు. మనలో ఎవరూ వంట చేసిన వెంటనే ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచరు.  ఆహారాన్ని మొదట తినడానికి బయట ఉంచుతారు. దీంతో అది మన ఇంటి గది ఉష్ణోగ్రత దగ్గర చల్లబడుతుంది. ఆ తర్వాతే దాన్ని ఫ్రిజ్‌లో ఉంచుతారు.ఈ పరిస్థితే బ్యాక్టీరియా వల్ల ఆహారం కలుషితం అయ్యే ఛాన్స్ ను ఇస్తుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

◆ ఫ్రిజ్ లోని ఫుడ్ లో బ్యాక్టీరియా పెరగకుండా ఉండాలంటే.. త్వరగా పాడై పోయే ఛాన్స్ ఉన్న ఫుడ్ ను ముందుగా తినండి.

◆ ఇంకా మిగిలిపోయిన ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి లేదా మూతపెట్టి ఉంచండి.

◆ మీ మిగిలిపోయిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్ టాప్ రాక్‌లో కూడా ఉంచొచ్చు. తద్వారా అది మరింత గాలి , చల్లదనాలను పొందుతుంది.

◆ ఫ్రిజ్ లో ముందు భాగంలో పాత ఫుడ్స్, వెనుక భాగంలో కొత్త ఫుడ్స్ ఉంచండి.

◆ ఫ్రిజ్ లోని ఫుడ్ ను తినే ముందు దాన్ని ఒకసారి చూడండి. వాసన చూడటం ద్వారా ఇప్పటికీ తినడానికి సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయడం ఉత్తమం.

◆ ఆహారం యొక్క భద్రతపై మీకు సందేహాలు ఉంటే.. ఎక్కువ ఆలోచించకుండా పారేయండి. వీలైనంత వరకు తాజాగా వండిన ఆహారాన్ని తినాలి.