Artificial Pancreas: కృత్రిమ ప్యాంక్రియాస్‌ తో ప్రయోగం సక్సెస్

టైప్-2 డయాబెటీస్‌తో బాధపడేవారికి కొత్త జీవితాన్ని ఇచ్చే కృత్రిమ ప్యాంక్రియాస్‌ను

టైప్-2 డయాబెటీస్‌తో బాధపడేవారికి కొత్త జీవితాన్ని ఇచ్చే కృత్రిమ ప్యాంక్రియాస్‌ ను (Artificial Pancreas) బ్రిటన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు విజయవంతంగా పరీక్షించారు. కృత్రిమ ప్యాంక్రియాస్‌ (Artificial Pancreas) అల్గారిథమ్ ఆధారంగా పని చేస్తుంది. ఆఫ్-ది-షెల్ఫ్ గ్లూకోజ్ మానిటరింగ్ తో పాటు ఇన్సులిన్ పంపింగ్ ప్రక్రియను ఇది CamAPS HX అనే మొబైల్ యాప్‌తో లింక్ చేస్తుంది. మన బాడీలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి ఎంత ఇన్సులిన్ అవసరమో ఈ యాప్ అంచనా వేస్తుంది.కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలోని వెల్కమ్ – MRC ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటబాలిక్ సైన్స్ పరిశోధకులు కృత్రిమ ప్యాంక్రియాస్‌ (Artificial Pancreas) ను అభివృద్ధి చేశారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న చాలా మంది వ్యక్తులు ఇన్సులిన్ ఇంజెక్షన్ల వంటి చికిత్సలను ఉపయోగించి వారి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కష్టపడతారు.  కృత్రిమ ప్యాంక్రియాస్ (Artificial Pancreas) వారికి సహాయం చేయడానికి సురక్షితమైన, ప్రభావ వంతమైన విధానాన్ని అందించగలదు. ఈ సాంకేతికత ఉపయోగించడానికి సులభమైనది. ఇంట్లో సురక్షితంగా వాడొచ్చు.

ట్రయల్స్ వివరాలు ఇవీ..

కృత్రిమ ప్యాంక్రియాస్ తో నిర్వహించిన ట్రయల్స్ కు సంబంధించిన అధ్యయన నివేదిక “నేచర్ మెడిసిన్” జర్నల్‌లో పబ్లిష్ అయింది.మొదటి ట్రయల్‌ కోసం టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న 26 మంది రోగులను ఎంపిక చేశారు. వారిని రెండు గ్రూప్ లుగా విభజించి.. ఒక గ్రూప్ కు కృత్రిమ ప్యాంక్రియాస్ అమర్చారు. ఎనిమిది వారాల పాటు వారిపై ట్రయల్ నడుస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మొదటి గ్రూప్ వారికి ఇన్సులిన్ ఇంజెక్షన్ల యొక్క ప్రామాణిక చికిత్స ఇచ్చారు.ఇక రెండో గ్రూప్ వారికి తొలుత ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఎనిమిది వారాల తర్వాత వారికి కృత్రిమ ప్యాంక్రియాస్‌ ను అమర్చారు. కృత్రిమ ప్యాంక్రియాస్‌ని ఉపయోగిస్తున్నప్పుడు సగటు గ్లూకోజ్ స్థాయిలు 12.6 మి.మీ./లీ నుంచి 9.2 మి.మీ./లీకి తగ్గాయని వారు కనుగొన్నారు. కృత్రిమ ప్యాంక్రియాస్  గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ లేదా HbA1c అని పిలువబడే అణువు యొక్క స్థాయిలను తగ్గించడంలో సహాయపడింది.

పాంక్రియాస్‌ (Pancreas) ఎక్కడ ఉంటుంది?

ఇది పొట్టకు పై భాగంలో చిన్న పేగు మొదలయ్యే చోట ఉంటుంది. ఈ గ్రంథికు అనుసంధానమై ఉండే ట్యూబ్‌ ద్వారా జీర్ణరసాలు చిన్నపేగులోకి ప్రవహిస్తాయి.

పాంక్రియాస్‌ ఏయే పనులు చేస్తుంది?

దీని ప్రధాన కర్తవ్యం జీర్ణరసాలను ఉత్పత్తి చేసి విడుదల చేయడం,  ఇన్సులిన్‌ హార్మోన్‌ను విడుదల చేయడం. జీర్ణ రసాలు ఆహారంలోని కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్‌లు, కొవ్వును వేరు చేసి జీర్ణప్రక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తాయి. ఇన్సులిన్‌ రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధం చేస్తుంది. దేహానికి శక్తిని విడుదల చేస్తూ కొంత శక్తిని నిల్వ చేసుకుంటుంది.

పాంక్రియాస్‌, షుగర్ వ్యాధి..

ఇన్సులిన్ అనేది మన శరీరంలోని Pancreas ఉత్పత్తి చేసే హార్మోన్. Pancreas అనేది ఇన్సులిన్‌ను మన శరీర రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఇలా రక్తంలో ప్రవహించే ఇన్సులిన్, శరీర కణాలలోకి చక్కెర (గ్లూకోజ్) ప్రవేశించేలా చేస్తుంది. దీనిద్వారా శరీరానికి శక్తి అందుతుంది. అంటే ఈ ప్రక్రియలో ఇన్సులిన్ వ్యక్తుల రక్తప్రవాహంలో చక్కెర మొత్తాన్ని తగ్గిస్తుంది. మీ రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతే, Pancreas నుంచి ఇన్సులిన్ స్రావం కూడా తగ్గుతుంది. గ్లూకోజ్ అనేది ఒక రకమైన చక్కెర. కండరాలు, ఇతర కణజాలాలను తయారు చేసే కణాలకు ఇది శక్తి వనరు. మన శరీరానికి గ్లూకోజ్ రెండు ప్రధాన వనరుల నుంచి అందుతుంది. వ్యక్తులు తినే ఆహారం లేదా కాలేయం ద్వారా ఇది లభిస్తుంది. ఈ చక్కెర రక్తప్రవాహంలో కలిసి, ఇన్సులిన్ సహాయంతో శరీర కణాలలోకి ప్రవేశిస్తుంది. మన కాలేయం కూడా గ్లూకోజ్‌ను తయారు చేసి, నిల్వ చేస్తుంది. ఎవరైనా సమయం ప్రకారం తిననప్పుడు గ్లూకోజ్ కొరత ఏర్పడుతుంది. గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కాలేయం నిల్వ చేసిన గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా విచ్ఛిన్నం చేస్తుంది ఒకవేళ క్లోమ గ్రంధి ఇన్సులిన్‌ను సరిగా ఉత్పత్తి చేయకపోయినా లేదా ఇన్సులిన్ పనితీరులో లోపాలు ఉన్నా.. రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది. గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగే ఈ స్థితినే డయాబెటిస్ లేదా మధుమేహం అంటారు

Also Read:  Ulcers: అల్లాడించే అల్సర్స్.. కారణాలు, పరిష్కారాలు