Egg Kaaram: కోడిగుడ్డు కారం ఇలా చేస్తే చాలు ప్లేటు మొత్తం ఖాళీ అవ్వాల్సిందే?

  • Written By:
  • Updated On - February 24, 2024 / 09:59 PM IST

మామూలుగా మనం కోడిగుడ్డుతో అనేక రకాల వంటలు చేసుకొని తింటూ ఉంటాం. ఇంట్లో రెండు మూడు రకాల వెరైటీస్ మాత్రమే చేసుకొని తింటే రెస్టారెంట్లో ఎన్నో రకాల రెసిపీస్ ఉంటాయి. అటువంటి వాటిలో కోడిగుడ్డు కారం కూడా ఒకటి. కొంతమంది ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకుంటే మరి కొంతమంది హోటల్ రెస్టారెంట్ లో వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ రెసిపీ ని ఇలా చేయాలి అన్న విషయం చాలామందికి తెలియదు. మరి ఈ రెసిపీ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

ఉల్లిపాయలు – నాలుగు
గుడ్లు – ఆరు
కరివేపాకులు – ఒక రెమ్మ
నూనె – తగినంత
కారం – అర స్పూను
పసుపు – పావు స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
ఎండుమిర్చి – 15
నువ్వులు – ఒక స్పూను
ధనియాలు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
ఎండు కొబ్బరి పొడి – మూడు స్పూన్లు
ధనియాలు – ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు – 10
పుట్నాల పప్పు – మూడు స్పూన్

తయారీ విధానం :

ముందుగా కారంపొడిని తయారు చేసుకోవాలి. మిక్సీలో ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ పొడిలా కాకుండా కాస్త బరకగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. వాటిలో కోడిగుడ్లను వేయించాలి. కోడిగుడ్ల పైన ఉన్న తొక్క రంగు బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయించాలి. ఉల్లిపాయల రంగు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయిస్తే బాగుంటుంది. వాటిలోనే కరివేపాకులు, వేయించిన కోడిగుడ్లు కూడా వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పుని కాస్త తగ్గించి వేసుకుంటే మంచిది. ఎందుకంటే మిక్సీ పట్టుకున్న కారప్పొడిలో కూడా ఉప్పు వేసాము, కాబట్టి ఆ రెండింటిని చూసుకొని ఉప్పు వేసుకుంటే మంచిది. ఇప్పుడు స్టమ్ మంటను తగ్గించి ఈ కారం పొడిని వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు అలా వేయించాలి. అంతే కోడిగుడ్డు కారం రెడీ.