Site icon HashtagU Telugu

Eating Too Much Salt: అధికంగా ఉప్పు తినడం వల్ల మన ప్రాణాలకు ముప్పు..!

Salt

Salt

మనం రోజూ తీసుకునే ఆహారపదార్థాల ద్వారా శరీరానికి అవసరమైన ఉప్పు (Salt) అందుతుందని, ఇంకా అదనంగా ఉప్పు తీసుకోవడమంటే ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచి కోసమో, సరిపోలేదనో ఆహార పదార్థాల్లో మరింత ఉప్పు వేసుకోవడం అనారోగ్యాలకు దారితీస్తుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు చెప్పారు. ప్లేటులో వడ్డించిన పదార్థాలపై ఇంకొంచెం ఉప్పు జల్లుకుని తినేవారితో పోలిస్తే ఈ అలవాటు లేని వాళ్లకు గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ముప్పు తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. మన ఆహారపు అలవాట్ల ప్రకారం రోజుకు సగటున 10 గ్రాముల ఉప్పు శరీరంలోకి చేరుతోందని అంచనా. అధిక రక్తపోటు భయంతో ఉప్పును తీసుకోవడం మరీ తగ్గించడమూ మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. మితంగా తీసుకోవడం మంచిదని, అవసరమనీ సూచిస్తున్నారు. ఉప్పులో ఉండే సోడియం మన శరీరంలోని ద్రవాలను సమతూకంగా ఉంచేందుకు తోడ్పడుతుందని వివరించారు. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలోకి ఎక్కువ మోతాదులో సోడియం చేరుతుందని, దానివల్ల రక్తనాళాల్లోకి ద్రవాలు ఎక్కువగా చేరతాయని ఫలితంగా రక్తపోటు పెరుగుతుందని చెప్పారు.

యునైటెడ్ కింగ్ డమ్ (UK) లో 11.8 సంవత్సరాల పాటు 1,76,750 మంది పేషెంట్ల ఆహారపు అలవాట్లను, ఆరోగ్య సమస్యలను పరిశీలించినట్లు అమెరికా నిపుణులు చెప్పారు. ఇందులో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటు ఉన్న 7 వేల మందికి గుండెపోటు రాగా, 2 వేల మంది పక్షవాతం బారిన పడ్డారు. జీవనశైలి, ఇతర వ్యాధులు ఉన్నప్పటికీ భోజనం చేసేటపుడు అదనంగా ఉప్పు వేసుకోనివారిలో హృద్రోగ సమస్యలు తక్కువగా ఉండడం గమనించినట్లు న్యూ ఆర్లీన్స్‌ కు చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ లు చీ తేల్చి చెప్పారు.

Exit mobile version