Buttermilk: వేసవిలో రోజుకో గ్లాసు మజ్జిగ తాగడం వల్ల చాలా లాభాలున్నాయి!

వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే ఆహార పదార్థాలు, పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది.

వేసవిలో చల్లగా, రిఫ్రెష్ గా అనిపించడంలో కోసం కూల్ డ్రింక్స్, కోలా, సోడాలు తాగుతారు. కానీ వాటి కంటే ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు బోలెడు ఉన్నాయి. అదే మజ్జిగ (Buttermilk) లేదా చాస్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన ఈ పానీయం ఉష్ణోగ్రతను తగ్గించి శరీరానికి మేలు చేస్తుంది. పెరుగు నుంచి వచ్చే మజ్జిగ చాలా రుచిగా ఉంటాయి. వాటిని మరింత రుచిగా మార్చుకునేందుకు అందులో కొద్దిగా నిమ్మకాయ రసం, కాస్త కొత్తిమీర వేసుకుని తాగితే వడదెబ్బ నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ నిండి ఉంటుంది. మజ్జిగలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. కండరాలు బలోపేతం చేయడం, మెరిసే చర్మాన్ని ఇచ్చేందుకు, బలమైన ఎముకల్ని నిర్మించడంలో మజ్జిగ సహాయపడుతుంది.

ఒక గ్లాసు మజ్జిగలో (Buttermilk) ప్రోబయోటిక్స్, విటమిన్ ఏ, ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కళ్ళని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక వ్యవస్థని పెంచుతుంది. ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మండే ఎండ నుంచి ఇంటికి రాగానే ఒక గ్లాసు మజ్జిగ తాగితే చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. మజ్జిగ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..

శక్తిని ఇస్తుంది:

మజ్జిగలో రిబోఫ్లోవిన్ ని అందించే విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని అమైనో ఆమ్లాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కడుపులో మంటని తగ్గిస్తుంది.

పాలకు ప్రత్యామ్నాయం:

మజ్జిగ పాలకు సరైన ప్రత్యామ్నాయం. ఇది జీర్ణం కావడం కూడా చాలా సులభం. మజ్జిగ తయారీ ప్రక్రియలో పాలలోని లాక్టోస్ విచ్చిన్నం చేసి జీర్ణం చేసే బ్యాక్టీరియాను జోడించి దాన్ని లాక్టిక్ యాసిడ్ గా మారుస్తుంది. అందువల్ల లాక్టోస్ మొత్తం తగ్గుతుంది.

పేగులకు మంచిది:

శరీరంలోని అవయవాలను సజావుగా పని చేసేందుకు పేగులు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. మజ్జిగలో పేగుల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది ఆహారాన్ని వేగంగా, సాఫీగా జీర్ణం అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది.

ఎముకలకు బలం:

మజ్జిగలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది. అందుకే తరచూ మజ్జిగ తీసుకుంటే కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. కాల్షియం శరీర ఎముక నిర్మాణాలకు మాత్రమే కాదు.. రక్తంలో సిగ్నలింగ్ వ్యవస్థలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తుంది.

కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది:

మజ్జిగ గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు మజ్జిగలో 0.5 గ్రాముల సంతృప్త కొవ్వు మాత్రమే ఉంటుంది. హైపర్ కొలేస్టెరోలేమియా సమస్య ఉన్నవాళ్ళు మజ్జిగ తాగితే మంచిది. బరువు తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం MFGM లిపిడ్లు కొలెస్ట్రాల్, వాపుని తగ్గించడంలో సహాయపడతాయి. MFGM లిపిడ్‌లను మిల్క్ ఫాస్ఫోలిపిడ్‌లు అని కూడా అంటారు.

ఎసిడిటీ తగ్గిస్తుంది:

ఆయిల్, స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల తరచుగా పొట్టలో యాసిడ్ రిఫ్లక్స్ కు దారి తీస్తుంది. గుండెల్లో మంట, తీవ్రమైన అజీర్ణానికి కారణమవుతుంది. గ్లాసు మజ్జిగలో నల్ల మిరియాలు, కొత్తిమీర కలిపి తీసుకుంటే ఎసిడిటీ లక్షణాలు తక్షణమే తగ్గించుకోవచ్చు. మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్ పొట్టలోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తాయి.

మజ్జిగలో పుదీనా, కొత్తిమీర, నల్ల ఉప్పు, అల్లం, మిరియాలు వేసుకుని చేసుకుని తాగితే రుచిగా ఉంటుంది.

Also Read:  Employee’s Movement: ఏసీబీ అస్త్రం రెడీ! ఉద్యోగుల ఉద్యమంలో జగన్ అంకం!