Sunscreen: చర్మ సంరక్షణలో భాగంగా మనలో చాలామంది సన్‌స్క్రీన్‌ని ప్రతిరోజూ వాడుతున్నారు. మహిళలే కాదు, పురుషులు కూడా ఇప్పుడు చర్మాన్ని ఎండ కిరణాల నుంచి కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని UV కిరణాల వల్ల కలిగే హానుల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా సన్‌బర్న్, ముడతలు, వృద్ధాప్య ఛాయలు, స్కిన్ క్యాన్సర్ వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. సన్‌స్క్రీన్ వాడకంతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో దీనిపై కొన్ని ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా సన్‌స్క్రీన్ వాడటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి తగ్గిపోతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంది.
విటమిన్ డి ఎందుకు అవసరం?
విటమిన్ డి మన ఆరోగ్యానికి చాలా కీలకం. ఇది శరీరంలో కాల్షియాన్ని గ్రహించేందుకు సహాయపడుతుంది. ఎముకలు బలంగా ఉండేందుకు, దంత సమస్యలు రాకుండా చూసేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇది ఎంతో అవసరం. అంతేకాదు, మూడ్ స్వింగ్స్‌ను కూడా నియంత్రించడంలో విటమిన్ డి ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇతర విటమిన్లు మనం ఆహారంతో అందుకోవచ్చు. కానీ విటమిన్ డి ముఖ్యంగా సూర్యరశ్మి ద్వారా శరీరంలో తయారవుతుంది. అయితే సన్‌స్క్రీన్ వాడటం వల్ల UVB కిరణాలు చర్మానికి తాకకుండా ఉండటం వల్ల విటమిన్ డి ఉత్పత్తి తగ్గిపోతుందా?
సన్‌స్క్రీన్ ఎలా పని చేస్తుంది?
సన్‌స్క్రీన్ కంటే ముందు, UV కిరణాల గురించి తెలుసుకోవాలి. ఈ కిరణాలు రెండు రకాలుగా ఉంటాయి UVA, UVB. వీటిలో UVB కిరణాలే విటమిన్ డిని తయారుచేయడంలో కీలకం. అయితే SPF గల సన్‌స్క్రీన్‌లు UVB కిరణాలను నిరోధించడానికి పనిచేస్తాయి. ఉదాహరణకి, SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ 97 శాతం UVB కిరణాలను అడ్డుకుంటుంది. SPF 50 అయితే 98 శాతం వరకు అడ్డుకుంటుంది. అంటే సన్‌స్క్రీన్ వాడితే నిజంగా విటమిన్ డి తయారీ తగ్గుతుంది. కానీ పూర్తిగా అడ్డుకోదని కూడా గుర్తించాలి.
నిపుణుల మాటలోకి వస్తే…
చర్మవైద్య నిపుణులు చెప్తున్నదేమిటంటే వాస్తవానికి చాలామంది సన్‌స్క్రీన్‌ను సరిగ్గా అప్లై చేయరు. ప్రతి 2 గంటలకు అప్లై చేయడం కూడా మర్చిపోతారు. అలాంటప్పుడు UVB కిరణాలు కొంతమేర చర్మాన్ని తాకుతాయి. దాంతో విటమిన్ డి శరీరానికి అందుతుంది. అలాగే చాలామంది ముఖానికి, చేతులకు మాత్రమే సన్‌స్క్రీన్ అప్లై చేస్తారు. ఈ కారణంగా శరీరంలోని మిగిలిన భాగాలకు UVB కిరణాలు తాకే అవకాశం ఉంది. దీంతో విటమిన్ డి లోపం పెద్దగా రావడం లేదని నిపుణులు చెప్తున్నారు.
అయితే విటమిన్ డి కోసం సన్‌స్క్రీన్ వాడకూడదా?
ఇది చాలామందిని కలవరపెడుతోంది. కానీ నిపుణుల సలహా ప్రకారం, సన్‌స్క్రీన్‌ను మానేయడం సరైనది కాదు. ఎందుకంటే సూర్యరశ్మిలో ఉండే UV కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి విటమిన్ డి కోసం సన్‌స్క్రీన్ మానేయడం బదులు ఇతర మార్గాలు అన్వేషించాలి.
విటమిన్ డి కోసం ఏం చేయాలి?
.వారంలో 2–3 రోజులు సూర్యరశ్మిలో సుమారు 10–20 నిమిషాలు సన్‌స్క్రీన్ లేకుండా గడపాలి.
.గుడ్లు, మష్రూమ్స్, సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిష్‌ను ఆహారంలో చేర్చుకోవాలి.
.అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.
కాగా, సన్‌స్క్రీన్‌ను సరైన రీతిలో వాడటం వల్ల చర్మాన్ని రక్షించుకోవచ్చు. అదే సమయంలో, విటమిన్ డి అవసరాన్ని గుర్తించి, ఆహారం, పద్ధతిగా ఎండలో ఉండటం, సప్లిమెంట్ల ద్వారా దీన్ని సమతుల్యంగా పొందడమే ఆరోగ్యానికి మేలుగా ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
Read Also: Fire Break: పహాడీషరీఫ్‌లో భారీ అగ్నిప్రమాదం..