. చిన్న వయసులో ఫోన్ అలవాటు.. మానసిక సమస్యలకు దారి
. నిద్రలేమి నుంచి ఊబకాయం వరకూ ఆరోగ్య ముప్పు
. పేరెంట్స్ జాగ్రత్తే పిల్లల భవిష్యత్తు
Smartphone: చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారని భోజనం తినట్లేదని లేదా మారం చేస్తున్నారని వెంటనే ఫోన్ చేతిలో పెట్టేస్తున్నారా? అయితే క్షణం ఆలోచించండి. పిల్లలను కంట్రోల్ చేయడానికి తాత్కాలిక పరిష్కారంగా కనిపిస్తున్న ఈ అలవాటు భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా వెలువడిన ఓ అంతర్జాతీయ అధ్యయనం చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటు పడటం పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల విషయంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న పిల్లల్లో నిరాశ (డిప్రెషన్), ఆందోళన, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫోన్‌లో గడిపే సమయం పెరిగే కొద్దీ పిల్లలు నిజ జీవితానికి దూరమవుతున్నారు. ఆటలు, స్నేహితులతో మెలగడం, కుటుంబంతో మాట్లాడడం వంటి సహజమైన సామాజిక అలవాట్లు తగ్గిపోతున్నాయి.
దీని ప్రభావంగా పిల్లలు ఒంటరితనం, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అధ్యయనం చెబుతోంది. స్మార్ట్‌ఫోన్ పిల్లల మనసును నెమ్మదిగా దెబ్బతీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన కోసం అమెరికాలోని 10 వేల మందికి పైగా పిల్లల డేటాను సేకరించారు. ఆ విశ్లేషణలో 12 ఏళ్లకు ముందే ఫోన్ ఉపయోగిస్తున్న పిల్లల్లో నిద్రలేమి ప్రధాన సమస్యగా గుర్తించారు. రాత్రివేళ ఫోన్ వాడటం వల్ల నిద్ర సమయం తగ్గిపోతోంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని చిన్న వయసులోనే బరువు పెరగడం ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవే భవిష్యత్తులో షుగర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్మార్ట్‌ఫోన్‌లు లేని పిల్లలు మానసికంగా, శారీరకంగా మరింత ఆరోగ్యంగా ఉన్నారని ఈ ఏడాది పాటు సాగిన అధ్యయనం తేల్చింది. టాబ్లెట్ లేదా ఇతర డిజిటల్ పరికరాలు ఉన్నా కూడా ఫలితాల్లో పెద్ద మార్పు లేదని వెల్లడైంది.
ఈ అధ్యయన ఓ ప్రధాన రచయిత, పిల్లల మనోరోగ వైద్యుడు మాట్లాడుతూ..ఈ పరిశోధనలో పిల్లలు ఫోన్‌లో ఏమి చూస్తున్నారు అనే అంశాన్ని పరిశీలించలేదని తెలిపారు. కేవలం ఫోన్ ఉండటమే పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంటే వారు తీసుకునే డిజిటల్ కంటెంట్ ఎంత ప్రమాదకరమో ఊహించవచ్చని ఆయన అన్నారు. అందుకే వీలైనంతవరకు చిన్నపిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం అనిపించినా పరిమిత సమయం మాత్రమే ఫోన్ ఇవ్వాలని తప్పనిసరిగా పేరెంటల్ కంట్రోల్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. పిల్లల్ని నిశ్శబ్దంగా ఉంచేందుకు ఫోన్ ఒక సులభమైన మార్గంలా కనిపించినా అదే వారి ఆరోగ్యాన్ని నెమ్మదిగా హానిచేసే ఆయుధంగా మారవచ్చని గుర్తుంచుకోవాలి. పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లో కాదు మన జాగ్రత్తలోనే ఉందన్న విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోకూడదు.
