మల బద్ధకం.. ఈ సమస్య ఎంతోమందిని వేధిస్తుంటుంది. మల విసర్జన అనేది సాధారణ ప్రక్రియ. శరీరతత్వాన్ని బట్టి ఇది మారుతుంటుంది. మల విసర్జన సజావుగా కాకపోవడాన్ని మలబద్ధకంగా పరిగణించవచ్చు. తీవ్ర ఒత్తిడితో విరేచనం అవ్వడం, మల ద్వారంపై ఒత్తిడి పెట్టడం వల్ల పగుళ్లు ఏర్పడటం వంటి వాటిని మల బద్ధకం లక్షణాలుగా చెబుతారు. వీటి వల్ల మల ద్వారం వద్ద తీవ్రమైన నొప్పి, మంట, వాపు, రక్తం కారడం వంటివి జరుగుతుంటాయి. దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ‘ఫిషర్స్’ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కారణాలు ఏమిటి?
మారుతోన్న జీవనశైలితో పాటు, ఆహారం, నీరు ఆరోగ్యకర స్థాయిలో తీసుకోకపోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి పలు కారణాల వల్ల మల బద్దకం వస్తుంది.
ఆహారంలోనూ లోపం…
ప్రస్తుత బిజీబిజీ యుగంలో చాలా మంది రెడీ టూ ఈట్ ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా మల బద్దకానికి గల కారణాల్లో ఒకటి. ఆహారాన్ని సరైన మోతాదులో తీసుకోక పోవడం వల్ల మలం గట్టిగా మారి విసర్జనకు సమయం తీసుకుంటుంది. ఇది బయటకు రావాలంటే తీవ్ర ఒత్తిడి పెట్టాల్సి ఉంటుంది. ఆహారంలో పీచు పదార్థాలు చాలా తక్కువ మోతాదులో ఉండటం వల్ల విరేచనం సరిగా అవ్వదు.
తగినంత నీరు తాగకున్నా..
రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల మంచి నీటిని తాగాలి. దీని కంటే తక్కువ స్థాయిలో నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తక్కువ అయ్యి డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలాంటి సమయంలో శరీరం తనకు కావాల్సిన నీటిని మూత్రం, మలం నుంచి తీసుకుంటుంది. ఫలితంగా మూత్ర సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటివి వస్తుంటాయి.
జీవనశైలిపై కన్నేయండి..
జీవన శైలి సరిగా లేకపోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయడం, శరీరానికి తగినంత శ్రమ ఇవ్వకపోవడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి వాటి వల్ల మలబద్ధకం వస్తుంది.
మలబద్ధకం దూరం కావాలంటే..
డైట్‌లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా చేర్చాలి.రోజూ మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాల స్థాయి (ఫైబర్) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఫలితంగా మల బద్ధకం సమస్య ఏర్పడకుండా ఉంటుంది.మంచి నీరు, పళ్ల రసాలను ఎక్కువగా తాగాలి.ఇక ఫిషర్స్ సమస్యతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారు కూడా అజాగ్రత్త వహించకుండా డాక్టర్లను కలవాలి.
నాటు వైద్యం పనిచేస్తుందా?
మలబద్ధకం ప్రారంభ దశలో ఉన్నప్పుడు నాటు వైద్యం తీసుకుంటే ఫలితం ఉండే అవకాశం ఉంది. అయితే కాస్త తీవ్రమయ్యాక నాటు వైద్యం తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాటు వైద్యం వల్ల మల ద్వారం వద్ద ఏర్పడిన పగుళ్లు (పుండ్లు) మరింత లోతుగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫలితంగా ఇది ప్రమాదకర ఫిస్ట్యుల్లా వైపునకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.