Site icon HashtagU Telugu

Heart: గుండె సంబంధిత మరణాలు ఇండియాలోనే ఎక్కువగా ఉండటానికి కారణం తెలుసా?

Do You Know The Reason Why Heart Related Deaths Are High In India

Do You Know The Reason Why Heart Related Deaths Are High In India

ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు.. అప్పటివరకు ఆడుతూ పాడుతూ మనతోనే కలిసి తిరిగిన వాళ్లు తనువు చాలిస్తున్నారు. ఏం జరిగిందో తెలిసుకునేలోపే మ్యత్యుఒడిలోకి చేరుకుంటున్నారు. అప్పటివరకు జిమ్‌ చేస్తూ ఎంతో ఫిట్‌గా ఉన్న కానిస్టేబుల్‌ విశాల్‌ క్షణకాలంలో మరణించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హార్ట్ అటాక్‌ (Heart Attack) తో కానిస్టేబుల్ మృతిచెందిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటుచేసుకుంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ విశాల్ (24) ఈరోజు ఉదయం సికింద్రాబాద్‌లోని ఓ జిమ్‌కు వెళ్లి ఎక్సర్ సైజ్ చేస్తూ ఒక్కసారిగా కిందపడి పోయాడు. గమనించిన జిమ్ సిబ్బంది.. అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండె పోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతి చిన్న వయస్సులోనే అతనికి గుండె పోటు రావడం భయాందోళన కలిగిస్తోంది.

ఒకప్పుడు వయస్సు మీద పడిన వారికి, స్థూలకాయం ఉన్న వారికి గుండె పోటు వచ్చేది. కానీ ఇప్పుడు వయస్సు, ఊబకాయంతో సంబంధం లేకుండా గుండె ఆగిపోతోంది. సన్నగా ఉన్నా, నిత్యం వ్యాయామం చేస్తున్నా సరే గుండె పోటు ముప్పు నుంచి తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా భారతీయుల్లో గుండె సంబంధిత మరణాలు పెరిగిపోయాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా కూడా అదే చెబుతోంది. గుండె సంబంధిత మరణాల్లో ఐదో వంతు మరణాలు ఇండియాలోనే నమోదవుతున్నాయట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్షమందిలో 235 మంది హార్ట్‌ అటాక్‌ (Heart Attack) తో చనిపోతుండగా.. ఇండియాలో మాత్రం ప్రతి లక్ష మందిలో 272 మంది గుండె పోటుతో చనిపోయారు.

ఇక 30 ఏళ్ల లోపు యువత గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య కూడా ఇండియాలోనే ఎక్కువగా ఉంది. అనారోగ్యకరమైన జీవనశైలి, అసమతుల్య ఆహారం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం లాంటివి యువతలో గుండె సమస్యలకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ‘ఇండియన్ హార్ట్ అసోసియేషన్’ (Indian Heart Association) ప్రకారం, గుండె పోటు హెచ్చరికలు లేకుండానే తక్కువ వయస్సు గల యువకుల మీదనే మరణాల పంజా విసురుతోంది. పాశ్చాత్య దేశాల కంటే కనీసం పది సంవత్సరాల ముందు భారతీయులు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. వయసు పెరిగినపుడు వచ్చే గుండె పోటు కొన్నేళ్లుగా తక్కువ వయస్సులోనే అటాక్ చేస్తోంది. వాతావరణ కాలుష్యం, గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటివి గుండె పోటుకు దారి తీస్తున్నాయి. 2030 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా గుండె సంబంధిత మరణాలు నమోదవుతున్న దేశంగా భారత్ నిలుస్తుందని, ప్రతి నాలుగు మరణాలలో ఒకటి ‘కార్డియో వాస్కులర్ డిసీజ్’ (Cardio Vascular Disease) కారణంగా సంభవిస్తుందని అధ్యయనాలు చెబుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Also Read:  Blood: ఈ ఆహార పదార్థాలు తింటే మీ రక్తం శుద్ధి అవుతుంది, హిమోగ్లోబిన్ లెవెల్ కూడా పెరుగుతుంది