Muscle Pain : మనిషి శరీరంలో కండరాల నొప్పి అనేది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంటుంది. అయితే, కండరాల నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువగా వ్యాయామం చేయడం, ఏదైనా గాయం అవ్వడం, సరైన భంగిమ లేకపోవడం, ఒత్తిడి, పోషకాహార లోపం వంటివి కండరాల నొప్పికి కారణం కావచ్చు. కండరాల నొప్పులు దీర్ఘకాలికంగా బాధిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి. కానీ, సాధారణ కండరాల నొప్పులను మనం ఇంటి చిట్కాలు, ఆహారంతో తగ్గించుకోవచ్చు.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి..
కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. పసుపును పాలల్లో వేసుకుని తాగడం వల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం కూడా దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం టీ తాగడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
చేపలు, అవిసె గింజలు, చియా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ నొప్పిని తగ్గించడంలో, కండరాల వాపును తగ్గించడంలో బాగా సహాయపడతాయి. బెర్రీలలో (స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు) యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. అదేవిధంగా చెర్రీస్ కూడా కండరాల నొప్పిని, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లలో బ్రొమెలైన్, పాపైన్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి.
కండరాల నొప్పులు తగ్గించడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. కండరాలకు తగినంత విశ్రాంతి ఇవ్వడం వల్ల అవి త్వరగా కోలుకుంటాయి. వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలకు రిలాక్సేషన్ లభించి, నొప్పి తగ్గుతుంది. ఐస్ ప్యాక్‌ను కండరాల నొప్పి ఉన్న చోట పెట్టుకోవడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. అయితే, ఐస్ ప్యాక్‌ను నేరుగా చర్మం మీద పెట్టకుండా, ఒక గుడ్డలో చుట్టి పెట్టాలి.
మసాజ్ కూడా కండరాల నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె, ఆవ నూనె వంటి నూనెలతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కండరాలకు ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల కండరాల బిగుతు తగ్గి, నొప్పి తగ్గుతుంది. రోజులో తగినన్ని నీళ్లు తాగడం కూడా చాలా అవసరం. శరీరంలో తగినంత నీరు ఉన్నప్పుడు కండరాలు సరిగ్గా పనిచేస్తాయి. వీటితో పాటు మంచి నిద్ర కూడా కండరాల నొప్పులను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ పద్ధతులను అనుసరిస్తే కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏదైనా నొప్పి దీర్ఘకాలంగా బాధిస్తే తప్పకుండా వైద్యుని సంప్రదించాలి.
Cloud Burst : ఉత్తరాఖండ్‌లో భారీ వరదల కారణంగా కొట్టుకుపోయిన ఇళ్లు