కొందరికి ముక్కుమీద కోపం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కోపం టన్నుల కొద్దీ వస్తుంటుంది. ఎప్పుడూ చికాకుగా ఉంటారు. ఇతరులపై అరుస్తూ గోల చేస్తారు. వాస్తవానికి అలాంటివారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఉండలేరు.. ఎందుకంటే కోపం వారి ప్రశాంతతను పాడుచేస్తుంది. అందుకే కోపంతో ఊగిపోతుంటారు.
ఇదే విషయంపై కాలిఫోర్నియా యూనివర్సిటీలో పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మనం తీసుకునే ఆహారానికి, కోపానికి సంబంధం ఉందా అనే విషయంపై పరిశోధనలు చేశారు. అది నిజమే అని తేలింది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారమే మన కోపానికి కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు. అందుకే కోపాన్ని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు, కోపాన్ని తగ్గించే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే కోపాన్ని నియంత్రించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలాంటి ఆహారాలు తినకూడదు…
బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాలు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి తింటే కోపం పెరుగుతుంది. చిప్స్, నూడుల్స్, చైనీస్ ఫ్రైడ్ రైస్, జంక్ ఫుడ్, కేకులు తరచుగా తినేవారికి విపరీతమైన కోపం వస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు, ఈ ఆహారాలు తినేవారు కోపాన్ని నియంత్రించుకోలేరట.
చక్కెరకు దూరంగా ఉండాలి…
చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లకు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వీటిని తినట్లయితే మనలో ఉండే కోపం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. విసుగు, చికాకు వంటివి వస్తాయి. కాబట్టి వీటన్నింటికి దూరంగా ఉండటం మంచిది.
ఏ ఆహారం తీసుకోవాలి….
కోపాన్ని నియంత్రించడంలో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు బాగా ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా మన కోపాన్ని నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చేపలలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు, వీటిలో మంచి కొలెస్ట్రాల్ కూడా మెండుగా ఉంటుంది. గుడ్లు, బాదం, వాల్ నట్స్ లలో కూడా కోపాన్ని తగ్గించే గుణాలుంటాయి. వీటిల్లో ఉండే పోషకాలు కోపాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి.
ఇక మన శరీరంలో ఉండే డోపమైన్ అనే హార్మోన్ కోపాన్ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ పెరగడానికి పుట్టగొడుగులు, చికెన్, చేపలు, గుడ్లు సహాయపడతాయి. కానీ వీటన్నింటినీ కూడా మోతాదులోనే తీసుకోవడం మంచిది. ఇక గుమ్మడి గింజలు, పాలకూర, పొద్దుతిరుగుడు గింజలు కోపాన్ని నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
