మార్చి నెల వస్తుందంటే పిల్లలకు (Children) పరీక్షల టెన్షన్ మొదలవుతుంది. పరీక్షల తేదీలు దగ్గరికొచ్చే కొద్దీ ఒత్తిడి కూడా అదే స్థాయిలో పెరుగుతుంటుంది. పిల్లల పరిస్థితి చూసి తల్లిదండ్రులకూ టెన్షన్ తప్పదు. అయితే, పిల్లలపై పరీక్షల ఒత్తిడిని తగ్గించవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం తల్లిదండ్రులు, పిల్లలకు పలు సూచనలు చేస్తున్నారు. పిల్లల్లో ఒత్తిడికి కారణాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా పలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు.
పిల్లలపై (Children) పరీక్షల ఒత్తిడికి ప్రధాన కారణం తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న అంచనాలను అందుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు. మంచి మార్కులు సాధించాలనే తపనతో పిల్లలు కష్టపడి చదువుతుంటారు. ఈ క్రమంలో వాళ్ల మనసుల్లో పలు సందేహాలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. తల్లిదండ్రులు పదే పదే మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించడం, బంధుమిత్రుల పిల్లలతో పోల్చి హెచ్చరించడం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతుందని వెల్లడించారు.
దీనివల్ల పిల్లలలో మానసిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, డిప్రెషన్ కు గురయ్యే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఎదురవకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, వారి శక్తికి మించిన లక్ష్యాలను నిర్దేశించ వద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరీక్షలు దగ్గరికొచ్చాయని ఆటలు కట్టిపెట్టి చదువుపై దృష్టిపెట్టాలని తల్లిదండ్రులు తరచుగా పిల్లలకు చెబుతుంటారు.
నిజానికి రాత్రీపగలు చదవడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటారని సైకియాట్రిస్టులు తెలిపారు. అలసిన శరీరానికి, మనసుకు తగిన విశ్రాంతి లభించేలా చూడడం తల్లిదండ్రుల బాధ్యత అని, చదువుతో పాటు ఇతర వ్యాపకాలు కూడా పిల్లలకు అవసరమేనని చెప్పారు. పరీక్షల సమయంలో వాతావరణాన్ని తేలికగా, ఒత్తిడికి దూరంగా ఉంచుకునేందుకు కొంత సమయం కేటాయించాలని సూచించారు.
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నిపుణుల సూచనలు:
- టైంటేబుల్ తయారుచేసుకుని ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి.
- మధ్యమధ్యలో కాసేపు విరామం తీసుకోవడం తప్పనిసరి.
- శారీరక ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవాలి, తరచుగా నీళ్లు తాగుతుండాలి.
- పరీక్షల కోసం నిద్రమానుకుని చదవడం వల్ల ఉపయోగం పెద్దగా ఉండదు.. రోజూ కనీసం 8 గంటలు నిద్రించాలి.
- నిత్యం తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా చురుకుగా ఉండవచ్చు.
- తల్లిదండ్రులు, తోబుట్టువులతో క్రమం తప్పకుండా మాట్లాడడం ద్వారా నిరాశను దూరంపెట్టొచ్చు.
- పరీక్షలకు ప్రిపేరయ్యే క్రమంలో ఎదుర్కుంటున్న సమస్యలపై కుటుంబ సభ్యులతో చర్చించాలి.
Also Read: ISRO: ఇస్రో ఖాతాలో మరో విజయం.. మూడు ఉపగ్రహాలను నింగిలో