Egg Freezing: సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ వర్సెస్ క్లినికల్ ఎగ్ ఫ్రీజింగ్.. ఏమిటి ? ఎందుకు ?

ఈతరం వాళ్లు పిల్లల్ని కనడానికి అంత తొందర ఎందుకున్న ఆలోచనలో ఉంటున్నారు.

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 07:30 AM IST

ఈతరం వాళ్లు పిల్లల్ని కనడానికి అంత తొందర ఎందుకున్న ఆలోచనలో ఉంటున్నారు. అయితే ఆలస్యంగా పిల్లల్ని కంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ అనే చికిత్స తెరపైకి వచ్చింది. దీన్ని ఇప్పటికే ఎంతోమంది సంపన్నులు, సెలెబ్రెటీలు వాడుతున్నారు. ఈ పద్ధతిలో భాగంగా మహిళలు యంగ్‌ ఏజ్‌లో ఉన్నప్పుడే వారి అండాలను సేకరించి శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేస్తారు. అనంతరం నచ్చినప్పుడు ఫెర్టిలిటీ చేసి తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. వయసు పెరిగినా కొద్ది అండోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందన్న కారణంతోనే ఈ ఎగ్‌ ఫ్రీజింగ్‌ వైపు అడుగులు వేస్తున్నారు. చిలీ దేశంలో గతేడాది కేవలం 4 నెలల్లోనే ఎగ్‌ ఫ్రీజింగ్‌ 50 శాతం పెరగడం గమనార్హం.

సోషల్ ఎగ్ ఫ్రీజింగ్..

సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే.. వైద్యపరమైన అంశాలు కాకుండా ఇతరత్రా కారణాలతో అండాలను నిల్వ చేయడం. కెరీర్ కోసం కొందరు.. ఆర్ధిక స్థిరత్వం కోసం కొందరు.. భావోద్వేగపరంగా కొందరు అండాలను ఫ్రీజింగ్ చేస్తుంటారు. పెళ్లి చేసుకోవడం ఆలస్యం అవుతున్న వారు కూడా సోషల్ ఫ్రీజింగ్ కు మొగ్గు చూపుతున్నారు.

క్లినికల్ ఎగ్ ఫ్రీజింగ్..

వైద్యపరమైన కారణాలతో అండాలను ఫ్రీజింగ్ చేస్తే దాన్ని క్లినికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. అండాశయ సమస్యలు, క్యాన్సర్, కీమో థెరపీ చేయించుకునే వారు, మెనో పాజ్ సమస్యలు కలిగిన వారు కూడా క్లినికల్ ఎగ్ ఫ్రీజింగ్ కు మొగ్గు చూపుతుంటారు.

నిపుణులు ఏం అంటున్నారు.?

వయసు పెరిగిన తర్వాత పిల్లల్ని కనకుండా ముందుగానే అండాలను దాచుకోవడం అనే విధానం వినడానికి బాగానే ఉన్నా ఇది కూడా ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. వయసులో ఉన్నప్పుడు అండాలను భద్రపరుచుకొని, తర్వాత గర్భం దాల్చినా ప్రమాదకరమని చెబుతున్నారు. దీనికి కారణం అండం ఆరోగ్యంగా ఉన్నా 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం ఇబ్బందికి దారి తీస్తుందని, వయసులో ఉన్నప్పుడే గర్భం దాల్చడం మంచిదని విశ్లేషిస్తున్నారు.

బ్రిటన్ లో కొత్త రూల్స్..

పిల్లలను ఎప్పుడు పొందాలో ప్రజలు నిర్ణయం తీసుకునే విధంగా బ్రిటన్ ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.  అండాలు , వీర్యాల నిల్వ పరిమితిని 55 సంవత్సరాలకు పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ గడువు 10 సంవత్సరాలుగా ఉండగా.. దాన్ని 55 ఏళ్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం వీర్యం, అండం దాచుకున్న తల్లిదండ్రులు పదేళ్ల కాలం లోపు సంతానోత్పత్తి చికిత్స చేయించుకోవాలి. లేకపోతే కణాలను నాశనం చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ పది సంవత్సరాలకు ఓ సారి కణాల నిల్వ కొనసాగించాలా.. లేదా నాశనం చేయాలా అనే ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది.