Site icon HashtagU Telugu

Chitti Kakarakaya Vepudu: చిట్టికాకరకాయ వేపుడు.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

chitti kakarakaya vepudu

chitti kakarakaya vepudu

Chitti Kakarakaya Vepudu: కాకరకాయ అంటేనే చాలా మంది చేదుగా ఉంటుందని తినరు. కొందరైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ టిప్స్ తో చిట్టికాకరకాయ వేపుడు చేసుకుని తింటే.. మళ్లీ మళ్లీ తింటారు. మరి టేస్టీ కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం.

చిట్టికాకరకాయ వేపుడుకు కావలసిన పదార్థాలు

జీలకర్ర – చిటికెడు
కారం – 2 స్పూన్లు
కల్లుప్పు – ఒకటిన్నర
పుట్నాలు – 2 గుప్పెళ్లు
ఉల్లిపాయలు – 2-3
నూనె – కాకరకాయలు డీప్ ఫ్రై కి సరిపడా

చిట్టికాకరకాయ వేపుడు తయారీ విధానం..

చిట్టి కాకరకాయల తల తోక కట్ చేసి.. పొట్టలో.. అదేనండి మధ్యలో గాటు పెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఉల్లిపాయలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో కాకరకాయ ముక్కలు, కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసి.. కాకరకాయలకు పట్టేంత వరకూ కలపాలి.

ఇప్పుడు జీలకర్ర, కారం, కల్లుప్పు, పుట్నాలు ఒక మిక్సీజార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను నీరు లేకుండా పిండుకోవాలి. (అలా చేస్తే వాటిలో పోషకాలు పోతాయనుకుంటే అలానే ఉంచుకోవచ్చు).

ఒక బాణలిలో నూనె పోసి.. వేడయ్యాక కాకరకాయల్ని డీప్ ఫ్రై చేయాలి. అదే బాణలిలో కోసిపెట్టుకున్న ఉల్లిపాయలు, చిటికెడు జీలకర్రవేసి.. ఉల్లిపాయలు కరకరలాడేంతవరకూ వేయించుకోవాలి. స్టవ్ ను సిమ్ లో పెట్టుకుని తయారు చేసిపెట్టుకున్న పప్పులపొడిని, ఎర్రగా వేయించిన కాకరకాయ ముక్కల్ని వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. ఈ స్టెప్స్ తో కాకరకాయ వేపుడు చేసుకుని.. వేడివేడి అన్నంలో వేసుకుని, కొద్దిగా నెయ్యి కలుపుకుని తింటే.. ఆహా ఆ రుచే వేరండి. మీరు ట్రై చేయండి.