Child Eating Mud: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆడుకుంటూ మట్టిని, సున్నాన్ని లేదా గోడ పెచ్చులను తింటున్నారని ఆందోళన చెందుతుంటారు. వైద్య పరిభాషలో ఈ అలవాటును ‘పికా’ అని పిలుస్తారు. ఈ సమస్య ప్రధానంగా చిన్న పిల్లల్లో పోషకాహార లోపం లేదా ఉత్సుకత (జిజ్ఞాస) కారణంగా కనిపిస్తుంది. పిల్లలు అప్పుడప్పుడు ఇలా చేస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ ఇది రోజూ వారీ అలవాటుగా మారితే మాత్రం తేలికగా తీసుకోకూడదు. సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఈ అలవాటును సులభంగా మార్చవచ్చు.
పిల్లల్లో మట్టి తినే అలవాటు ఎందుకు వస్తుంది?
వైద్యుల ప్రకారం.. శరీరంలో ఐరన్ (ఇనుము), కాల్షియం లేదా ఇతర ముఖ్యమైన పోషకాల లోపం ఉన్నప్పుడు పిల్లలు మట్టి వంటి పదార్థాలను తినాలని కోరుకుంటారు. కొన్నిసార్లు ఇది కేవలం అలవాటుగా లేదా రుచి చూడాలనే కుతూహలం వల్ల కూడా జరుగుతుంది. అయితే ఎక్కువగా మట్టి తినడం వల్ల కడుపులో పురుగులు, ఇన్ఫెక్షన్, కడుపు నొప్పి, ఆకలి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
Also Read: నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన!
ఈ అలవాటును మాన్పించడానికి కొన్ని సులభమైన చిట్కాలు
పోషకాహారం అందించండి: పిల్లలకు అరటిపండ్లు, పాలు, పెరుగు, ఆకుకూరలు తినిపించడం వల్ల శరీరంలో పోషకాల లోపం తొలగి అనవసరమైన వస్తువులు తినాలనే కోరిక తగ్గుతుంది.
అరటిపండు- పాలు: పండిన అరటిపండును పాలు లేదా కొద్దిగా తేనెతో కలిపి ఇవ్వడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. పిల్లలకు క్రేవింగ్స్ తగ్గుతాయి.
లవంగాల నీరు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొద్దిగా మరిగించిన లవంగాల నీటిని (అవసరమైతే కొంచెం తేనె కలిపి) ఇవ్వడం వల్ల ఈ అలవాటు క్రమంగా తగ్గుతుంది.
వాము నీరు: రాత్రిపూట కొద్ది పరిమాణంలో వాము నీటిని ఇవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మట్టి తినే అలవాటును తగ్గించడంలో సహాయపడుతుంది.
