. ఆధునిక పద్ధతులు..అందరికీ సరిపోవు
. వంటింట్లోనే దొరికే సహజ చిట్కాలు
. చర్మాన్ని కాపాడే సంప్రదాయ మాస్కులు
Unwanted Hair : శరీరంపై ఉండే అవాంఛిత వెంట్రుకలను తొలగించుకోవడానికి ప్రస్తుతం అనేక విధానాలు అందుబాటులో ఉన్నాయి. షేవింగ్, వ్యాక్సింగ్, హెయిర్ రిమూవల్ క్రీములు వంటి పద్ధతులను చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉండవని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. షేవింగ్ వల్ల చర్మం గట్టిపడటం, వ్యాక్సింగ్ వల్ల నొప్పి, హెయిర్ రిమూవల్ క్రీముల్లో ఉండే రసాయనాల కారణంగా దురద, దద్దుర్లు, ఎర్రదనం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే కెమికల్స్‌కు దూరంగా, సహజమైన మార్గాలను అనుసరించడంపై ఆసక్తి పెరుగుతోంది.
శరీరంపై వెంట్రుకలను తొలగించేందుకు కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. పసుపు మరియు పాలు కలిపి గట్టి పేస్ట్‌లా తయారుచేసి అవసరమైన భాగంపై రాసి 15–20 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే వెంట్రుకలతో పాటు మురిక తొలగిపోతుంది. ఇంకొక పద్ధతి చక్కెర మరియు నిమ్మరసం. పాన్‌లో రెండింటిని సమానంగా వేసి వేడి చేసి బంగారు రంగు వచ్చాక చల్లారనివ్వాలి. దీన్ని చర్మంపై రాసి స్ట్రిప్స్‌తో వ్యతిరేక దిశలో లాగితే సహజ వ్యాక్సింగ్‌లా పనిచేస్తుంది. బొప్పాయి గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌గా చేసుకుని చర్మంపై రాసి 20 నిమిషాలు ఉంచితే అందులోని పపైన్ ఎంజైమ్ వల్ల వెంట్రుకలు క్రమంగా బలహీనపడతాయి.
మన ఇంట్లో ఎన్నో ఏళ్లుగా వాడుతున్న శనగపిండి మాస్క్ కూడా వెంట్రుకల తొలగింపులో కీలక పాత్ర పోషిస్తుంది. శనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్ చేసి చర్మంపై రాసి ఆరిన తర్వాత వ్యతిరేక దిశలో మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. అరటిపండులో ఓట్స్ కలిపి పేస్ట్ చేసి వృత్తాకారంలో మసాజ్ చేస్తే చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ తొలగిపోతాయి. అలాగే బొప్పాయి గుజ్జులో కలబంద జెల్ కలిపి వాడితే చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. ఈ విధంగా సహజ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, ఖర్చు లేకుండా, కెమికల్స్ అవసరం లేకుండా శరీరంపై అవాంఛిత వెంట్రుకలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చర్మానికి ఎలాంటి హాని లేకుండా సహజ అందాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
