Chanakya Niti: వివాహం అనేది జీవితంలో ఒక పెద్ద నిర్ణయం. దీనిని సరైన సమయంలో ఆలోచించి తీసుకోవడం చాలా ముఖ్యం. గొప్ప రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త అయిన ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో విజయవంతమైన వైవాహిక జీవితానికి అవసరమైన కొన్ని లక్షణాలను పేర్కొన్నారు.
మేధస్సు
కేవలం తెలివితేటలు లేదా పాండిత్యం ఉన్నంత మాత్రాన వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పలేము. తన జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం, గౌరవించడం, ప్రేమించడం వంటి సామాజిక స్పృహ లేనంత కాలం ఆ బంధం విజయవంతం కాదు. అందుకే తెలివితేటలతో పాటు భాగస్వామిని గౌరవించే ‘విజ్ఞత’ ఉండటం చాలా ముఖ్యం.
పెరిగిన వాతావరణం (సంస్కారం)
ఒక వ్యక్తి ఎలాంటి వాతావరణంలో పెరిగారు అనేది వారి ప్రేమ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. చిన్నప్పటి నుండి మంచి గుణాలు, నీతినిజాయితీలు, ఇతరులను గౌరవించడం వంటి సంస్కారాన్ని నేర్చుకున్న వ్యక్తి తన వైవాహిక జీవితంలో కూడా సానుకూల ఫలితాలను పొందుతాడు.
Also Read: Gold Price : ఆగని బంగారం ధర..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!
స్థిరమైన మనస్సు
పెళ్లి విజయవంతం కావాలంటే భార్యాభర్తలిద్దరి మనస్సులు స్థిరంగా ఉండటం చాలా అవసరం. మీ మనస్సు నిలకడగా లేకపోతే మీరు అవతలి వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేరు. అలాగే మీ భావాలను వారికి సరిగ్గా వివరించలేరు. దీనివల్ల అనవసరమైన మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుంది.
అనుకూలత (సర్దుబాటు గుణం)
సమయానికి అనుగుణంగా తనను తాను మార్చుకోగలిగే లేదా పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోయే వ్యక్తి జీవితాంతం సంతోషంగా ఉంటాడని చాణక్యుడు చెప్పేవారు. ఒక బంధంలో పంతాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం వల్ల గొడవలు తగ్గుతాయి.
వినడం – అర్థం చేసుకోవడం
ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను ఓపికగా వినే శక్తి ప్రతి వ్యక్తికీ ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామి మాటలకు, వారి ఆలోచనలకు విలువ ఇవ్వనంత కాలం మీరు వారితో కలిసి సంతోషంగా ఉండలేరు. అందుకే భాగస్వామి భావోద్వేగాలను గౌరవించండి. వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వండి.
