Site icon HashtagU Telugu

Cauliflower Roast: క్యాలీఫ్లవర్ రోస్ట్.. ఇంట్లోనే చాలా సింపుల్ గా ట్రై చేయండిలా?

Mixcollage 04 Jan 2024 05 00 Pm 4320

Mixcollage 04 Jan 2024 05 00 Pm 4320

మామూలుగా మనం క్యాలీఫ్లవర్ ను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే క్యాలీఫ్లవర్ ను ఉపయోగించి ప్రత్యేకంగా కొన్ని రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటాం. క్యాలీఫ్లవర్ ఫ్రై, క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ, క్యాలిక్ ఫ్లవర్ గోబీ, క్యాలీఫ్లవర్ 65 లాంటి రెసిపీలు తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా క్యాలీ ఫ్లవర్ రోస్ట్ తిన్నారా. తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

క్యాలీఫ్లవర్ రోస్ట్ కు కావాల్సిన పదార్థాలు :

క్యాలీఫ్లవర్ – చిన్నది ఒకటి
నూనె – 1 టేబుల్ స్పూన్
పసుపు – అర టీస్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
మిరియాల పొడి – అర టీ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
దాల్చిన చెక్క – తగినంత
లవంగాలు – 4
యాలకులు – 2
జీలకర్ర – అర టీ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు
పచ్చిమిర్చి – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
టమాట – పెద్దది ఒకటి
కారం – ఒకటిన్నర టీ స్పూన్
ధనియాల పొడి- 1టీస్పూన్
జీలకర్ర పొడి – పావు టీ స్పూన్
గరం మసాలా – అర టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
జీడిపప్పు పలుకులు – కొద్దిగా

క్యాలీఫ్లవర్ రోస్ట్ తయారీ విధానం:

ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కలను వేడినీటిలో వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఒక బాణాలిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాలీఫ్లవర్ ముక్కలను వడకట్టి నూనెలో వేయాలి. ఇందులో పసుపు,ఉప్పు వేసి కలపాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను మధ్య మధ్యలో కలపుతుండాలి. ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి కలిగి గిన్నెలోకి తీసుకుని అదే బాణాలిలో మరో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తర్వాత మసాలా దినుసులు జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటాను ప్యూరీ లాగా చేసి వేయాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని కలపాలి. తర్వాత వేయించిన క్యాలీఫ్లవర్ వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత జీడిపప్పు, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ రోస్ట్ రెడీ.