Cabbage Utappam: క్యాబేజీతో ఈ విధంగా ఊతప్పం చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే?

మామూలుగా మనం క్యాబేజీని ఉపయోగించి ఎన్నో రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. చాలామంది క్యాబేజీతో చేసిన వంటకాలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

  • Written By:
  • Updated On - February 15, 2024 / 09:55 PM IST

మామూలుగా మనం క్యాబేజీని ఉపయోగించి ఎన్నో రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. చాలామంది క్యాబేజీతో చేసిన వంటకాలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. క్యాబేజీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలామంది ఈ క్యాబేజీతో ఎప్పుడూ ఒకే విధమైన వంటలు కాకుండా వెరైటీగా ఏవైనా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా క్యాబేజీతో కొత్తగా ఊతప్పం ట్రై చేశారా. ఒకవేళ ఇప్పుడు తినకపోతే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఊతప్పం ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

క్యాబేజీ – పావు కిలో
పసుపు – చిటికెడు
కారం – అర స్పూను
ధనియాల పొడి – అర స్పూను
జీలకర్ర – అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – అర స్పూను
గరం మసాలా – పావు స్పూను
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – ఒకటి
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
బియ్యప్పిండి – రెండు స్పూన్లు
గోధుమపిండి – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – రెండు స్పూన్లు

తయారీ విధానం :

ముందుగా క్యాబేజీని తరిగి ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేయాలి. మరీ పేస్టులా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి. ఈ క్యాబేజీ తరుగును ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ, తరిగిన కొత్తిమీర, బియ్యప్పిండి, గోధుమపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలు పక్కన పెడితే క్యాబేజీ లోంచి కాస్త నీరు వస్తుంది. అప్పుడు అవసరమైతే మరి కొంచెం పిండిని కలుపుకోవచ్చు. దీనికి నీళ్లు వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి నూనె రాయాలి. ఈ క్యాబేజీ మిశ్రమాన్ని ఉండలా చుట్టి తీసుకొని దానిపై పెట్టి ఊతప్పం లాగా చేతితోనే ఒత్తుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఈ ఊతప్పాన్ని తీసి దానిపై వేసి కాల్చాలి. రెండు వైపులా బంగారు రంగులోకి మారేవరకు కాల్చుకోవాలి. అంతే రుచిగా ఉండే క్యాబేజీ ఊతప్పం రెడీ.