Cabbage Bonda: డాబా స్టైల్ క్యాబేజీ బోండా ఇలా చేస్తే చాలు ఒక్కటి కూడా మిగలదు?

మామూలుగా మనకు బోండాలు అనగానే ఎక్కువగా మైసూరు బోండాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. సాయంత్రం సమయంలో వేడివేడి స్నాక్స్ గా వీటిని తీసుకోవడానికి ఎ

Published By: HashtagU Telugu Desk
Cabbage Bonda

Cabbage Bonda

మామూలుగా మనకు బోండాలు అనగానే ఎక్కువగా మైసూరు బోండాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. సాయంత్రం సమయంలో వేడివేడి స్నాక్స్ గా వీటిని తీసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు వెరైటీగా క్యాబేజీ బోండాలు ట్రై చేశారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

క్యాబేజీ బోండాకి కావాల్సిన పదార్థాలు :

క్యాబేజీ తురుము – 2 కప్పులు
పెసరపప్పు – అరకప్పు
ఆలూ – ఒకటి
శనగపిండి – 2 కప్పులు
గరంమసాల – ఒక స్పూన్
కరివేపాకు – నాలుగు రెబ్బలు
ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు
కొత్తిమీర – కొద్దిగా
వంటసోడ – చిటికెడు
వాము – అర స్పూన్
కొబ్బరి తురుము – 2 స్పూన్లు
పచ్చిమిర్చి – మూడు
నూనె – తగినంత

క్యాబేజీ బోండా తయారీ:

ముందుగా పెసరపప్పును రెండు గంటల ముందు నానపెట్టుకోవాలి. ఆలూను ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. తరువాత స్టవ్‌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. తరువాత క్యాబేజీ తురుము, పెసరపప్పు వేసి బాగా కలపాలి. సరిపడానీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. తరువాత మెత్తగా చేసిన ఆలూ మిశ్రమం, కొత్తిమీర, గరం మసాల వేసి ఒక ఐదు నిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి తరువాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి. తరువాత గిన్నె తీసుకుని సెనగపిండి , వంటసోడ, ఉప్పు, వాము చేర్చి కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. స్టవ్‌ వెలిగించి బాణలి పెట్టి తగినంత నూనె పోసి కాగాక ముందుగా సిద్ధం చేసుకున్న ఉండల్ని శనగపిండిలో ముంచి నూనెలో వేయాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరి.

  Last Updated: 21 Jan 2024, 07:42 PM IST