కాకరకాయ తినడానికి కాస్త చేదుగా ఉన్నప్పటికీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయి. మనలో చాలామంది కాకరకాయ తినడానికి అసలు ఇష్టపడరు. ఇంకొందరు మాత్రం లొట్టలు వేసుకొని మరీ తినేస్తూ ఉంటారు. కాకరకాయతో రకరకాల కూరలు తయారు చేస్తూ ఉంటారు. అయితే కాకరకాయ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. మరి కాకరకాయను జుట్టుకు ఎలా ఉపయోగించాలో, ఎలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాకర రసం తరచూ కుదుళ్లు, జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుందట.
అయితే ఇందుకోసం అరకప్పు కాకర రసాన్ని తీసుకొని అందులో చెంచా కొబ్బరి నూనెను కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు, జుట్టు మొత్తానికి బాగా పట్టించి పది నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలట. ఇలా అరగంట అయ్యాక గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలట. ఇలా ఈ మిశ్రమాన్ని వారంలో రెండు సార్లు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే
మనం ఉపయోగించే హెయిర్ కేర్ ఉత్పత్తుల్లోని రసాయనాలు, బయట కాలుష్యం ప్రభావం కారణంగా చాలా మందిలో జుట్టు చివర్లు చిట్లుతుంటాయి. దీన్ని నివారించడానికి సరిపడినంత కాకరకాయ రసాన్ని తీసుకొని కురులకు పట్టించి 40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చొప్పున చేస్తే మూడు వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుందట.
చుండ్రు తగ్గాలి అంటే జీలకర్రను మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. అనంతరం దీన్ని కాకరరసంలో కలిపి కుదుళ్లకు బాగా పట్టించాలి. కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుందట. కాకర రసాన్ని వెంట్రుకల కుదుళ్ల నుంచి చివర్ల దాకా పట్టించి గంట పాటు ఆరనివ్వాలట. ఆ తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలట. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు..