Uma Telugu Traveller : ప్ర‌పంచ‌దేశాల‌ను చుట్టాల‌న్న ఓ స్వాప్నికుడి క‌థ‌..

మారుమూల ప‌ల్లెలో పుట్టి ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్న ఉమా తెలుగు ట్రావెల‌ర్‌

  • Written By:
  • Updated On - February 5, 2022 / 10:53 AM IST

ఉద్యోగం జేబులు నింప‌వ‌చ్చు. కానీ.. ట్రావెలింగ్ అనుభ‌వాల‌ను అందిస్తుంది. అవును నిజ‌మే. అందుకే అత‌ను బ‌య‌ల్దేరాడు.త‌న‌ జీవిత అనుభ‌వాలు ప్ర‌పంచంతో పంచుకుంటూ గ‌మ్యం తెలియ‌ని మ‌రో ప్ర‌యాణానికి బ‌య‌ల్దేరాడు. రెండేళ్ల‌లోనే తెలుగువాళ్లంద‌రికీ సుప‌రిచిత‌మైన‌ ఉమా తెలుగు ట్రావెల‌ర్ (Uma Telugu Traveller) ప్ర‌యాణంలోని కొన్ని పేజీలివి. చాలామందికి తెలిసిన ఉమాని మ‌రో కోణంలో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్న‌మే ఇది!

అత‌ను ఆఫ్రికా ఖండంలో
యంత్రభూతాల సంస్కృతితో పరిచయం లేని పల్లెజీవనాన్ని ప‌రిచ‌యం చేస్తాడు.
ఈజీప్టులోని స‌మాధులు చెప్పే స‌త్యాల‌ను ఆవిష్క‌రిస్తాడు.
ఎడారి ఇసుక తిన్నెల నుంచి త‌న్నుకొస్తున్న నిజాలు నిక్క‌చ్చిగా చూపిస్తాడు.
ఆరోగ్యకరమైన ప్రపంచం తాలూకు చివరి ఆనవాళ్లైన కొండ‌జాతుల‌ను స్పృశిస్తాడు.
వేలమైళ్ల దూరంలో ఆవిష్కరించబడిన మన చరిత్ర ఆనవాళ్ల‌ను క‌ళ్ల‌ముందుంచుతాడు.
శతాబ్దాల మౌనంతో సమాధి అయిన సత్యాన్ని వెల్లడించాలని ఆరాట‌ప‌డ‌తాడు.
ఆఫ్రికా స్వర్గద్వారాలకు అమాయకుల ప్రాణాలను బలిచ్చిన ఘ‌ట‌న‌ల‌ను ఏక‌రువు పెడ‌తాడు..

అవును.. అత‌నో స్వాప్నికుడు. అత‌నో సాహ‌సికుడు. మొత్తంగా అత‌నో ట్రావెల‌ర్‌. అత‌ను నిరంత‌రం నేర్చుకోవాల‌ని ఆరాట‌ప‌డ‌తాడు. తాను నేర్చుకుంది న‌లుగురికి త‌న కెమెరా క‌ళ్ల‌తో చూపించాల‌ని ప‌రిత‌పిస్తాడు. అత‌నే ఉమా తెలుగు ట్రావెల‌ర్‌గా తెలుగువారికి సుప‌రిచిత‌మైన మాలెంపాటి ఉమాప్ర‌సాద్‌.

ఎవ‌రీ ఉమాప్ర‌సాద్‌? ఎక్క‌డ పుట్టాడు? ఎక్క‌డ పెరిగాడు? ఇవ‌న్నీ ఇప్ప‌టికే బీసీలాంటి అంత‌ర్జాతీయ మీడియా సంస్ధ‌లే రాసేశాయి. కాబట్టి నాలుగు ముక్క‌లు. ఉమాది గుంటూరు జిల్లా తెనాలిలోని బూతుమల్లి. చాలాకాలం క్రిత‌మే అక్క‌డ సెటిలైన ఉమా కుటుంబం చాలా మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం. కొంత‌కాలం అక్క‌డా ఇక్క‌డా రోజుకు 20 రూపాయ‌ల జీతానికి ప‌నిచేసిన ఉమా.. ప్ర‌పంచ‌యాత్ర చేయాల‌న్న త‌న చైల్డ్‌హుడ్ డ్రీమ్‌ని మాత్రం మ‌ర్చిపోలేక‌పోయాడు. చెన్నైలో కొంత‌కాలం ఉద్యోగం చేయాల్సివ‌చ్చింది. ఇంత‌లో ఆఫ్రికాలోని మాలి దేశంలో ఉద్యోగం వ‌చ్చింది. అక్క‌డ ఉద్యోగం చేస్తున్నా కూడా ఏదో చేయాల‌ని, ప్ర‌పంచాన్ని చూడాల‌నే త‌ప‌న మాత్రం అలానే మిగిలిపోయింది.

కాలం కలిసిరానప్పుడు కొండంత ప్రయత్నం కూడా ఏ దారీ చూపకుండానే కొడిగట్టుకుపోతుంది. అదృష్టం అనుకూలించినప్పుడు కాకతాళీయంగా జరిగే ఒక చిన్న సంఘటనే కారుచీకట్ల పరదాలని తప్పించి వేకువదిశగా నడిపిస్తుంది. ఉమాప్ర‌సాద్ జీవితంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఇండియా నుంచే త‌న ట్రావెలింగ్ స్టార్ట్ చేయాల‌నుకున్న ఉమా..త‌న మిత్రుడి ప్రోత్సాహంతో ఆఫ్రికా వీడియోలు తీయ‌డం మొద‌లుపెట్టాడు. అప్ప‌టిదాకా పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి వీడియోలు చూసిన తెలుగు యూట్యూబ్ వీక్ష‌కుల‌కు ఇత‌ని వీడియోల్లో కొత్త‌ద‌నం క‌న‌బ‌డింది. అమెరికా, యూరోప్‌, ఇంగ్లీష్ ట్రావెలింగ్‌ వీడియోలు అల‌వాటైన మెద‌ళ్ల‌కు ఆఫ్రికా వీడియోలు కొత్త‌గా అనిపించాయి. ఒక‌టి….రెండు…. మూడు..చూస్తుండ‌గానే ఉమా యూట్యూబ్ ఛానెల్ ఉవ్వెత్తున లేచింది.

ఇక ఉమా వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. కట్‌ చేస్తే ఏడాదిన్నర వ్యవధిలో దక్షిణాఫ్రికా, మధ్య ఆసియాలోని టాంజానియా, కెన్యా, ఉగాండా, జాంబియా, రష్యా, బెనిన్‌, బుర్కినా ఫాసో.. ఇలా ఏకంగా 22 దేశాలు చుట్టేశాడు. ఉమా యూట్యూబ్ ఛాన‌ల్‌లో వ‌న్ మిలియ‌న్ వ్యూస్ సంపాదించిన వీడియోలు 10కిపైనే ఉన్నాయి.

ప‌నిని ప‌నిలా చేయ‌డం వేరు. ప్యాష‌న్‌తో చేయ‌డం వేరు. ఉమా మాట్లాడే  మాట‌లు నిక్క‌చ్చిగా ఉంటాయి. తీసే ప్ర‌తీ వీడియోల్లో అవ‌స‌ర‌మైన కంటెంట్ మాత్ర‌మే ఉంటుంది. మ‌న ప‌క్కింట్లోవాడిలా క‌లిసిపోతాడు. ఎదురింటి కుర్రాడు ట్రావెలింగ్ క‌థ‌లు చెబుతున్న‌ట్టుంటాయి అత‌ని వీడియోలు. దీంతో జ‌నం అల‌వాటుప‌డిపోయారు. అల‌వాటు అన‌డంకంటే అడిక్ట్ అయిపోయారు. ఎంత‌గా అంటే ఉద‌యం 8గంట‌ల‌కు ఉమా వీడియో రాక‌పోతే వీడియోల కింద కామెంట్లు పెట్టేంత అభిమానుల్ని ఉమా సంపాదించుకున్నాడు.

త‌క్కువ ఖ‌ర్చుతో.. ఎక్కువ ట్రావెలింగ్‌

ఏ దేశానికి వెళ్లినా ఏ ప్రాంతాన్ని సంద‌ర్శించినా అక్క‌డి వారితో క‌లిసిపోవ‌డం ఉమా వీడియోలు చూసే ప్ర‌తీ ఒక్క‌రికీ అత‌నిలో క‌నిపించే మొట్ట‌మొద‌టి ల‌క్ష‌ణం. కాస్ట్‌లీ హోట‌ల్స్‌లో కాకుండా కౌచ్‌స‌ర్ఫింగ్ (Couch Surfing App) యాప్ ద్వారా స్ధానికుల స‌హాయం తీసుకోవ‌డం ద్వారా త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌యాణం చేస్తుంటాడు.10 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నా కూడా ఇప్ప‌టికీ త‌న ద‌గ్గ‌రున్న సెల్‌ఫోన్‌తోనే వీడియోలు తీస్తుంటాడు. ప్ర‌స్తుతం శ్రీలంక టూర్‌లో ఉన్న ఉమా.. అక్క‌డి తెలుగు మూలాల‌ను అన్వేషించే ప‌నిలో ఉన్నాడు. 8 ఏళ్లలో 197 దేశాలను చుట్టి రావాలన్న‌ది అత‌ని టార్గెట్‌.!

చివ‌ర‌గా..
మ‌న‌లో కలలు కనేవారు చాలామందే ఉంటారు. కానీ.. కొద్దిమందే ప్రపంచమంతా నిద్రించేవేళలో కూడా మెలకువతో ఉండి తమ స్వప్నాల సాఫల్యానికి కృషిచేస్తారు.ఆ ప్రయత్నంలో విజయం సాధించిన వారికి లోకం జేజేలు పలుకుతుంది. అలా ప్ర‌స్తుతం తెలుగు ట్రావెల‌ర్స్‌లో ఫేమ‌స్ అయిన వాళ్ల‌లో మాలెంపాటి ఉమాప్ర‌సాద్ ఒక‌రు. తెలుగు యూట్యూబ్ ట్రావెల‌ర్స్‌లో అతి త‌క్కువ స‌మ‌యంలోనే ల‌క్ష‌ల‌మంది అభిమానుల్ని సంపాదించిన ఉమా జీవిత ప్ర‌యాణం ప్ర‌తీ ఒక్క‌రికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మే!

Uma Telugu Traveller Channel Link :

https://www.youtube.com/c/UmaTeluguTraveller/