Site icon HashtagU Telugu

Beerapottu Pachikaram : బీరపొట్టు – పచ్చికారం.. ఇలా ట్రై చేస్తే చాలా కమ్మగా ఉంటుంది

Beerapottu Pachikaram Recipe

Beerapottu Pachikaram Recipe

Beerapottu Pachikaram Recipe : ఎప్పుడూ రొటీన్ వంటలే కాకుండా.. కొంచెం డిఫరెంట్ వంటలు చేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. బీరకాయలతో మీ ఇంట్లో రకరకాల వంటల్ని చేస్తుంటారు. బీరకాయ ఇగురు, బీరకాయ పాలు, బీరకాయ-రొయ్యలు, బీరకాయ తొక్కు పచ్చడి ఇలా రకరకాలుగా వండి ఉంటారు కదా. ఎప్పుడైనా బీరపొట్టు పచ్చికారం కాంబినేషన్ ట్రై చేశారా? కొంచెం ఓపికగా వండితే.. చాలా కమ్మగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బీరకాయ లోపలి గుజ్జులోనే కాదు.. పొట్టులోనూ పోషకాలుంటాయి. మందులు చల్లకుండా సహజంగా పెంచిన బీరకాయల పొట్టు తీసి ఈ రెసిపీని ట్రై చేయండి.

బీరపొట్టు-పచ్చికారం రెసిపీకి కావలసిన పదార్థాలు

బీరకాయలు – 1/2 కేజీ
పల్లీలు – 1.1/2 టేబుల్ స్పూన్
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి – 5-6
నూనె – 1.1/2 టేబుల్ స్పూన్
మినపప్పు – 1/2 టేబుల్ స్పూన్
ఆవాలు – 1/2 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1/2 టీ స్పూన్
చితకొట్టిన వెల్లుల్లి రెమ్మలు – 5
ఇంగువ – 1/4 టీ స్పూన్
పసుపు – 1/4 టీ స్పూన్
ఉప్పు – తగినంత
కారం – కావలసినంత

బీరపొట్టు – పచ్చికారం పొడి తయారీ విధానం

బీరకాయల్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసి.. దానిని మళ్లీ శుభ్రంగా కడుక్కొని.. కళాయిలో వేసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడొక కళాయిలో పల్లీలను వేసి వేయించి.. చల్లార్చి పొట్టుతీసుకోవాలి. అదే కళాయిలో నువ్వులు, ధనియాలను వేసి ఒక జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పల్లీలు వేసి మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టుకుని.. అదే జార్ లో పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టించుకోవాలి. అందులోనే బీరపొట్టు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి.

ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి.. వేడయ్యాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. అవి వేగాక.. ఇంగువ, పసుపు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక మిక్సీ పట్టించి పెట్టుకున్న బీరపొట్టు వేసి వేయించుకోవాలి. పూర్తిగా వేగాక ఉప్పు, కారం వేసి కలిపి.. మరో నిమిషం వేయించాక ముందుగా ఆడించుకున్న నువ్వులు, ధనియాలు, పల్లీల పొడి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.. బీరపొట్టు పచ్చికారం పొడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పొడి, నెయ్యి కలిపి తింటే.. చాలా కమ్మగా ఉంటుంది.

Exit mobile version