BCG Vaccine : బీసీజీ టీకాతో టైప్ -1 డయాబెటిస్ రోగుల్లో కోవిడ్ నుంచి దీర్ఘకాల రక్షణ..!!

టైప్-1 డయాబెటిస్ రోగుల్లో కోవిడ్ కు అడ్డుకట్ట వేసేందుకు పరిశోధకులు మరోముందుడుగు వేశారు.

  • Written By:
  • Publish Date - August 17, 2022 / 10:11 AM IST

టైప్-1 డయాబెటిస్ రోగుల్లో కోవిడ్ కు అడ్డుకట్ట వేసేందుకు పరిశోధకులు మరోముందుడుగు వేశారు. క్షయ నివారణకు వాడే బీసీజీ టికాతో డయాబెటిస్ రోగుల్లో కోవిడ్ నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సీన్స్ వైరస్ నివారణే పరిమితం అవుతున్నాయి. బీసీజీ టీకాను పలు మోతాదుల్లో ఇవ్వడం వల్ల కోవిడ్ తోపాటు ఇతర వైరస్ లతోపాటు అంటు వ్యాధులకు కూడా చెక్ పెడుతుందని తేలింది. 144 మంది టైప్ 1 మధుమేహ వ్యాధిగ్రస్తులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ఈ పరిశోధనలో కోవిడ్ పై బీసీజీ టీకా 92శాతం సామార్థ్యాన్ని చూపించింది. నిజానికి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉండే టైప్ 1 షుగర్ పేషంట్లకు కోవిడ్ సోకినట్లయితే అది ప్రాణానికే అపాయం. పరిశోధనలో పాల్గొన్న షుగర్ రోగులకు కోవిడ్ సోకడానికి ముందు బీసీజీ టీకాను మూడు డోసులు ఇచ్చారు. అవి వారికి కోవిడ్ నుంచి రక్షణ కవచంగా నిలిచాయని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి పరిశోధకుడు డెవిస్ ఫౌస్ట్ మన్ తెలిపారు.

ఇక ఈ టీకాతో ప్రతికూల ఫలితాలు కనిపించలేదన్నారు. టీకా ఆలస్యంగా ప్రభావం చూపిస్తుంది. అయినా కూడా దీర్ఘకాలంగా రక్షణగా నిలుస్తుందన్నారు. ఇదేకాదు కోవిడ్ కొత్త వేరియంట్లపైనా కూడా ఇది ప్రభావం చూపిస్తుందన్నారు. క్షయ రోగ నివారణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది పది కోట్ల మంది బాలలకు ఈ టీకాను ఇస్తున్నారు.