అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా బాగా పండిన అరటి పండ్ల వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అరటిపండును ఉపయోగించి ముఖంపై ముడతల సమస్యలను కూడా ఈజీగా పోగొట్టుకోవచ్చు. మరి అందుకోసం అరటిపండుతో ఏం చేయాలో,ఎలా చర్మాన్ని సంరక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖం అందంగా మారడానికి, ముడతలను పోగొట్టడానికి అరటిపండు ప్రయోజనకరంగా ఉంటుందట.
అరటి పండ్లలో కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి 1, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి అనేక విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ముడతలు, సన్నని గీతలను కూడా తగ్గిస్తుందట. అలాగే చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది డీహైడ్రేటెడ్ స్కిన్ సెల్స్ ను మాయిశ్చరైజ్ చేస్తుంది. అంతేకాకుండా అరటి పండ్లలో ఉండే జింక్, ఇతర సమ్మేళనాలు వివిధ చర్మ సమస్యలను దూరంగా ఉంచడానికి సహాయపడతాయట. అరటి పండ్లలో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ను పెంచడానికి సహాయపడుతుంది.
అరటిపండు ఫేస్ ప్యాక్ చర్మంపై ముడతలు, గీతలు, మొటిమల మచ్చలను తొలగించడానికి బాగా సహాయపడుతుందట. అయితే ఇందుకోసం ముందుగా సగం అరటిపండు గుజ్జును తీసుకుని అందులో ఒక టీ స్పూన్ తేనె ఒక టీ స్పూన్ పాలు వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. 20 నిమిషాల పాటు గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడుసార్లు ప్రయత్నించడం వల్ల ఈజీగా మొటిమలు, ముడతల సమస్యలు తగ్గుతాయట. మరో రెమెడీ విషయానికి వస్తే.. సగం అరటిపండు గుజ్జులో ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్, పెరుగు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మంపై ముడతలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుందని చెబుతున్నారు. ఈ ఫేస్ ప్యాక్ ను తరచుగా ట్రై చేస్తూ ఉండడం వల్ల ఎలాంటి మచ్చలు ముడతలు లేని మెరిసిపోయే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు..