. ఇయర్‌బడ్స్‌తో ప్రమాదం ఎలా?
. చెవి గులిమి అవసరమేనా?
. ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
Earbuds : మన శరీరాన్ని రోజూ శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, చెవుల విషయంలో కూడా చాలామంది అదే విధంగా ఆలోచిస్తారు. చెవుల్లో కనిపించే ఇయర్‌వాక్స్ (గులిమి)ను వెంటనే తొలగించాలనే ఉద్దేశంతో ఇయర్‌బడ్స్, కాటన్ స్వాబ్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ అలవాటు మేలు కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని వైద్యులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. చెవులు శుభ్రం అవుతున్నాయనుకున్నా, వాస్తవానికి ప్రమాదం పెరుగుతోందని వారు చెబుతున్నారు.
చెవిలోకి కాటన్ స్వాబ్స్ లేదా ఇయర్‌బడ్స్‌ను లోతుగా పెట్టడం వల్ల గులిమి బయటకు రావడం కాదు, మరింత లోపలికి నెట్టబడుతుంది. ఇలా లోపలికి వెళ్లిన వాక్స్ చెవిపోటు దగ్గర చేరి నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. అలాగే చెవి లోపల ఉండే చర్మం చాలా సున్నితమైనది. ఇయర్‌బడ్స్‌తో తరచూ శుభ్రం చేయడం వల్ల ఆ చర్మం గాయపడే అవకాశం ఉంది. దీని ఫలితంగా మంట, వాపు, చికాకు మాత్రమే కాకుండా వినికిడి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. వైద్యుల అంచనాల ప్రకారం, చెవులకు సంబంధించిన గాయాల్లో సుమారు 70 శాతం వరకు కాటన్ స్వాబ్స్ వాడకం వల్లనే జరుగుతున్నాయి.
చాలామందికి చెవి గులిమి అనేది హానికరమైనదన్న అపోహ ఉంది. కానీ వాస్తవానికి గులిమి చెవులకు సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా చెవిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. శరీరం సహజంగానే చెవులను శుభ్రపరుచుకునే విధానాన్ని కలిగి ఉంటుంది. గులిమి క్రమంగా తనంతట తానే బయటకు వస్తుంది. అందువల్ల ప్రత్యేకంగా చెవిలోకి ఏ వస్తువులు పెట్టి శుభ్రం చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. శుభ్రం చేయాలనే ఉద్దేశంతో పిన్నులు, గుచ్చే వస్తువులు వాడటం మరింత ప్రమాదకరం. వీటివల్ల బ్యాక్టీరియా లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ.
కొన్ని సందర్భాల్లో చెవిలో గులిమి అధికంగా పేరుకుపోయి నొప్పి, వినికిడి లోపం వంటి సమస్యలు కలగవచ్చు. అప్పుడు సొంతంగా ఇయర్‌బడ్స్‌తో శుభ్రం చేసుకోవడం అస్సలు సరైన మార్గం కాదు. వెంటనే చెవి వైద్యుడిని సంప్రదించాలి. వైద్యులు ప్రత్యేకమైన, సురక్షితమైన పరికరాలతో గులిమిని తొలగిస్తారు. ఇది పూర్తిగా భద్రమైన విధానం. ఇంట్లో చేసుకునే ప్రయోగాల వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. చెవులను శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇయర్‌బడ్స్ వాడటం అలవాటుగా మారితే అది ప్రమాదకరమే. చెవి గులిమి శత్రువు కాదు, రక్షకుడు. దాన్ని ప్రకృతి తన పని తానే చేయనివ్వడమే ఉత్తమ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.
