మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో టమాటాలు తప్పనిసరిగా ఉంటాయి. టమాటాలను అనేక వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. టమాటాలు లేకుండా చాలా వరకు వంటకాలు పూర్తి కావు. అయితే ఈ టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. మరి టమాటాలతో అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
అందుకే టమాటాలు మన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో మన చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా తయారవుతుంది. అంతేకాదు ఇది నల్ల మచ్చలును, పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుందని చెబుతున్నారు. టమాటాల్లో సహజ ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రంధ్రాలను బిగించడానికి సహాయపడతాయి. అలాగే చర్మంలో అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రించడానికి తోడ్పడుతుందట. అలాగే మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి కూడా సహాయపడతుందట. ఇది మన చర్మాన్ని అందంగా మారుస్తుందని చెబుతున్నారు.
టమాటాల్లో లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి టమాటాలు ఫ్రీ రాడికల్స్ తో సమర్థవంతంగా పోరాడుతాయి. ముఖంపై ఉండే సన్నని గీతలు, ముడతలు, అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. అలాగే మన చర్మం స్థితిస్థాపకతను పునరుద్ధరిస్తాయని చెబుతున్నారు. టమాటాల్లో శీతలీకరణ ప్రభావం ఉంటుంది. ఇది వడదెబ్బకు గురైన చర్మానికి ఉపశమనం కలిగిస్తుందట. అలాగే ఎరుపును తగ్గిస్తుందని ఇది సూర్యరశ్మి నష్టాన్ని తగ్గించడానికి సహజ నివారణగా పనిచేస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా టమాటాల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. టమాటాలు మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అలాగే మంచి పోషణను అందిస్తాయి. అంతేకాదు మన చర్మాన్ని తేమగా, మృదువుగా, బొద్దుగా ఉంచుతాయని చెబుతున్నారు..