చుండ్రు, తలపై దురదను తగ్గించే సింపుల్ చిట్కా..ఇలా చేస్తే చాలు ?

Control Dandruff :  శీతాకాలం అయినా లేదా మారుతున్న వాతావరణం అయినా సరే చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. ఇది తల దురదకు కారణమవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. మార్కెట్లో దొరికే షాంపూలు లేదా నూనెలు వాడటం వల్ల జుట్టు ఇంకా పొడిబారుతుంది. నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు పెరుగు మంచి ఆప్షన్ కావచ్చు. డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృష్ణ బలాలా పెరుగుతో అలాంటి ఓ సింపుల్ చిట్కాను చెప్పారు. పెరుగును ఎలా వాడాలో ఇప్పుడు […]

Published By: HashtagU Telugu Desk
Control Dandruff

Control Dandruff

Control Dandruff :  శీతాకాలం అయినా లేదా మారుతున్న వాతావరణం అయినా సరే చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. ఇది తల దురదకు కారణమవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. మార్కెట్లో దొరికే షాంపూలు లేదా నూనెలు వాడటం వల్ల జుట్టు ఇంకా పొడిబారుతుంది. నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు పెరుగు మంచి ఆప్షన్ కావచ్చు. డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృష్ణ బలాలా పెరుగుతో అలాంటి ఓ సింపుల్ చిట్కాను చెప్పారు. పెరుగును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో జుట్టు సమస్యలు ఎక్కువైపోయాయి. శీతాకాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు, తలపై దురద వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో ముఖ్యంగా చుండ్రు, తలపై దురద ఇబ్బంది పెడతాయి. వీటిని లైట్ తీసుకుంటే జుట్టు రాలడం పెరుగుతుంది. చాలా మంది ఈ సమస్యలు తగ్గించుకోవడానికి మార్కెట్‌లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అంటే రకరకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు. అయితే, వీటి వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు.

ఈ ప్రొడక్ట్స్‌లో ఉండే రసాయనాల వల్ల దీర్ఘకాలికంగా ప్రభావం ఉంటుంది. అయితే, ఇంటి సహజ నివారణలు వీటిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాంటి ఓ సహజ నివారణను డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృష్ణ బలాలా షేర్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఇంతకీ ఆ చిట్కా ఏంటి, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు చేసే మ్యాజిక్

డాక్టర్ కృష్ణ పెరుగుతో చుండ్రును తగ్గించే ఓ హెయిర్ మాస్క్‌ గురించి చెప్పారు. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం తల చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అదే సమయంలో దాని ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు జుట్టుకు పోషణను అందిస్తాయి. చుండ్రును మూలాల నుంచి తొలగించగలదు.

పెరుగులో ఉండే ప్రోటీన్లు, జింక్ వంటి పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సాయపడతాయి. ఇది ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు అవసరమైన హైడ్రేషన్ అందించి మృదువుగా మారుస్తుంది. చుండ్రు, తలపై దురదను తగ్గించడానికి పెరుగుతో హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  1. ​పెరుగు – ఒక టీ స్పూన్
  2. మెంతుల పొడి – ఒక టీస్పూన్
  3. నిమ్మరసం – ఒక నిమ్మకాయలో సగం రసం

తయారీ విధానం, వాడే పద్ధతి

ఒక గిన్నెలోకి ముందుగా పెరుగు, మెంతుల పొడి తీసుకుని బాగా కలపండి. ఇప్పుడు నిమ్మరసం కలపండి. ఈ మూడింటిని బాగా కలిపి ప్యాక్‌ని సిద్ధం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మీ తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయండి. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి.

ఇవి తల చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. మెంతుల పొడి జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్‌గా మార్చడంలో సాయపడుతుంది. ఇది కూడా చుండ్రు తగ్గించడంలో సాయపడుతుంది. చుండ్రు ఎక్కువగా ఉంటే ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల ప్రభావవంతంగా ఉంటుంది.

పెరుగు, తేనె, కొబ్బరి నూనె ప్యాక్

తల చర్మం చాలా పొడిగా ఉన్నప్పుడు చుండ్రు తరచుగా వస్తుంది. తేనె తేమను గ్రహించే సహజమైన హ్యూమెక్టెంట్. కొబ్బరి నూనె తల చర్మానికి కావాల్సినంత పోషణని ఇస్తుంది. ఇది చుండ్రును తొలగించి మీ జుట్టుకు మెరుపును పునరుద్ధరిస్తుంది.

ఇందుకోసం అరకప్పు పెరుగు, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ కొబ్బరి నూనె అవసరం. ఈ మూడు పదార్థాల్ని కలిపి మెత్తని పేస్ట్ సిద్ధం చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేయండి. 40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ జుట్టును శుభ్రం చేసుకోండి.

గుర్తించుకోవాల్సిన విషయాలు

  1. ​ఈ హెయిర్ ప్యాక్స్ కోసం తాజా పెరుగు వాడండి. పుల్లటి పెరుగు వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
  2. అంతేకాకుండా ప్యాక్స్ అప్లై చేసిన తర్వాత తలస్నానం కోసం వేడి ఎక్కువగా ఉన్న నీటిని ఉపయోగించవచద్దు. ఇది తలను మరింత పొడిబారుస్తుంది. గోరువెచ్చని లేదా చల్లటి నీరు బెస్ట్ ఆప్షన్.
  3. మెరుగైన ఫలితాల కోసం ఈ మాస్క్‌ల్లో దేనినైనా వారానికి ఒకటి లేదా రెండుసార్లు అప్లై చేయండి.
  4. ఈ ప్యాక్స్ అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఏదైనా దురద, మంట వస్తే వీటిని వాడటం మానేయండి.
  5. చుండ్రు, తలపై దురద ఎక్కువగా ఉంటే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించండి.
  Last Updated: 07 Feb 2026, 11:05 AM IST