టీనేజ్ అనేది పిల్లలు ఎదిగే వయసు. ఎంతో ముఖ్యమైనది. ఈ టైంలో పిల్లలపై పేరెంట్స్ శ్రద్ధ కొంచెం ఎక్కువే ఉండాలి. టీనేజ్ లో కొందరు పిల్లలకు ప్రధానంగా 5 సాధారణ ఆర్థోపెడిక్ సమస్యలు (Orthopedic Problems) వస్తుంటాయి.వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయించాల్సిన బాధ్యత పేరెంట్స్ పై ఉంటుంది. లేకపోతే పిల్లల బాడీ పెరుగుదలపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది.
టీనేజ్ పిల్లల్లో వచ్చే 5 సాధారణ ఆర్థోపెడిక్ సమస్యలు (Orthopedic Problems) ఇవీ
1. ఓస్గుడ్ స్క్లాటర్ వ్యాధి (Osgood Schlatter)
ఇది పెరుగుతున్న పిల్లలలో సంభవించే ఒక రకమైన మోకాలి నొప్పి . ఇది మోకాలి చిప్ప స్నాయువు షిన్‌తో అనుసంధానించే మోకాలి ప్రాంతంలో మంటను కలిగిస్తుంది. బాడీ పెరిగే క్రమంలో కొన్ని కండరాలు వేగంగా పెరుగుతాయి. మిగిలిన కండరాల పెరుగుదలకు కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈక్రమంలో ఏర్పడే ఒత్తిడి వల్ల కండరాలు లాగినట్టు నొప్పిని కలిగిస్తాయి. ఫలితంగా నొప్పి కలిగే ప్రాంతంలో మంట, చికాకు కలుగుతాయి. ఇటువంటి టైంల్ జంపింగ్ లేదా రన్నింగ్ వంటి శారీరక వ్యాయామాలు చేస్తే నొప్పి మరింత పెరుగుతుంది. ఈ టైంలో తగినంత విశ్రాంతిలో ఉండి.. మందులు వాడాలి.ఈ ప్రాబ్లమ్ దాదాపు దానంతట అదే సాల్వ్ అవుతుంది. శస్త్రచికిత్స అవసరం లేదు.
2. గూని (Scoliosis)
వెన్నెముకలో వంకరతనం ఏర్పడి వచ్చే సమస్యను గూని అంటారు. చెడు జీవనశైలి కారణంగా ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా పెద్దలను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని కేసులు టీనేజీ పిల్లల్లోనూ కనిపిస్తాయి. ప్రమాదం, జన్యు కారణాలు లేదా సెరిబ్రల్ పాల్సీ (CP) వంటి ఆరోగ్య సమస్యల కారణంగా పిల్లలకు గూని వస్తుంది. దీనివల్ల పార్శ్వగూని భుజాలు, నడుము, తుంటి , పక్కటెముక వంటి శరీరంలోని వివిధ భాగాలలో అసమానతను కలిగిస్తుంది. వెన్నెముక ఎంతమేర వంకరగా ఉందనే దాని ఆధారంగా చికిత్స ఉంటుంది. కొంతమంది రోగులకు బ్రేస్ థెరపీ సరిపోతుంది. మరి కొందరికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. గూని అనేది నయం చేయలేని వ్యాధి. అయితే ఇది జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయదు.
3. బెణుకులు (Sprains)
బెణుకు అంటే.. చీలమండ ప్రాంతంలో ఎక్కువగా సంభవించే స్నాయువు చిరిగిపోవడం లేదా సాగదీయడమనే సమస్య. మరో మాటలో తీవ్రమైన కీళ్ళ గాయం కూడా చెప్పొచ్చు. దీనికి చికిత్సగా వైద్యుల సూచనతో కోల్డ్ కంప్రెషన్, పెయిన్ కిల్లర్ మందులు వాడొచ్చు. కీళ్లపై స్ట్రెయిన్ పడకుండా ఉండేందుకు కాలును కట్టుతో, కొంచెం ఎత్తులో ఉంచాలి. కొన్ని రోజుల తర్వాత సున్నితమైన సాగతీత వంటి భౌతిక చికిత్స కూడా సహాయపడుతుంది.
4. స్లిప్డ్ క్యాపిటల్ ఫెమోరల్ ఎపిఫిసిస్
స్లిప్డ్ క్యాపిటల్ ఫెమోరల్ ఎపిఫిసిస్ అనేది 10-15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను ప్రభావితం చేసే అరుదైన పరిస్థితి. ఈ రుగ్మత వల్ల గ్రోత్ ప్లేట్‌లో నష్టం సంభవించి.. తొడ ఎముక దాని పైభాగం నుంచి జారిపోతుంది. దీనివల్ల గజ్జ ప్రాంతంలో నొప్పి కలుగుతుంది. తుంటిలో పట్టేసినట్టు అనిపిస్తుంది. కాళ్ల పొడవు అసమానంగా ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లలో కొందరికి శస్త్రచికిత్స అవసరం పడొచ్చు.
5. కౌమార వెన్ను నొప్పి (Adolescent Back Pain)
పెద్దలు అనుభవించే వెన్ను నొప్పి (బ్యాక్ పెయిన్) సమస్యనే.. కొందరు పిల్లలు కూడా ఫేస్ చేస్తుంటారు. సరిగ్గా కూర్చోక పోవడం, అసాధారణమైన ఒత్తిడి, కండరాలను ఎక్కువగా ఉపయోగించడం వంటి కారణాల వల్ల ఈ వెన్నునొప్పి వస్తుంది.
Also Read: Tongue Health Tips: నాలుక తెల్లగా ఉందా? ఆ వ్యాధుల ముప్పు..