Magnesium Rich Food: మెగ్నీషియం ఫుల్ ఫుడ్స్‌తో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు!!

శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో మెగ్నీషియం ఒక‌టి. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను ఇది క్రమబద్ధీకరిస్తుంది.

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 08:15 AM IST

Magnesium Rich Food: శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో మెగ్నీషియం ఒక‌టి. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను ఇది క్రమబద్ధీకరిస్తుంది. శరీరంలోని నరాలు ,కండరాల పనితీరును కూడా నియంత్రిస్తుంది. హార్ట్‌బీట్‌ ను సమంగా ఉంచుతుంది. ఇంత ముఖ్యమైన మెగ్నీషియం శరీరంలో లోపిస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. ఈ సమస్యల బారిన పడకుండా ఉంటే ప్రతి ఒక్కరూ మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అవేంటో చూద్దాం..

* డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్స్‌లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. మాంగనీస్, కాపర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి డార్క్ చాక్లెట్లలో ఉంటాయి. వీటిలో ఉండే కొకోవా నుంచి శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు అందుతాయి. అందుకే కనీసం 70 శాతం కంటే ఎక్కువ కొకోవా కంటెంట్ ఉండే చాక్లెట్లనే తినాలి.అది కూడా మితంగానే !!

* బాదం

బాదం, జీడి పప్పు, ఇతర నట్స్‌లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్, ఫైబర్ రక్తంలో చక్కెర నిల్వలు, కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. వీటిని చిరుతిండిగా తీసుకోవడం మంచిది. అల్పాహారంలోనో లేదా డెజర్ట్స్‌లో భాగంగా తీసుకున్నా మంచిదే.

* అరటి పండ్లు

అరటి పండ్లలో పొటాషియంతో పాటు మెగ్నీషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. రక్తపోటును నివారించడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాల్లో తేలింది. రక్తపోటును తగ్గించడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని అరటి పండ్లు తగ్గిస్తాయి.

* ఆకుకూరలు

ఆకుకూరల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. బచ్చలికూర, పాలకూర, తోటకూర, ఇతర ఆకుకూరల్లో మెగ్నీషియంతో పాటు ఐరన్, మాంగనీస్, ఇతర విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని మీ డైట్‌లో తీసుకుంటే అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు.గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్‌కు చెక్ పెట్టేందుకు అవసరమైన పోషకాలు ఆకుకూరల్లో ఉన్నాయి.

* గుమ్మడి గింజలు

గుమ్మడి గింజలు,అవిసె, చియాలలో మెగ్నీషియంతో పాటు మరిన్ని పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్, ఫైబర్‌తో ‌పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మనకు అవసరమైన సూక్ష్మ పోషకాలు. ఇవి మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి.చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తాయి.

*ఆరోగ్య ప్రయోజనాలు..

మనకు శరీరానికి రోజుకు 300 గ్రాముల మెగ్నీషియం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారు.
మెగ్నీషియం మన శరీరంలో 300 కంటే ఎక్కువ ఎంజైమాటిక్ ప్రతిచర్యలలో పాల్గొంటుంది. చిన్న ప్రేగులలో ఆహార పోషకాలను గ్రహించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్‌ నుంచి మనకు శక్తి వచ్చేలా మెగ్నీషియం సహాయపడుతుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. మెగ్నీషియం శక్తితోపాటు, ప్రశాంతంగా నిద్రపట్టేలా తోడ్పడుతుంది. ఇది శరీరంలోని నరాలు ,కండరాల పనితీరును నియంత్రిస్తుంది. హార్ట్‌బీట్‌ సమంగా ఉంచుతుంది. ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియంను శరీరం శోషించుకోవాలి. ఇందుకు మెగ్నీషియం తోడ్పడుతుంది. శరీరం ‘గ్లూటథయాన్‌’ అనే యాంటీఆక్సిడెంట్‌ను తనంతట తాను తయారుచేసుకోవడానికి మెగ్నీషియం అవసరం.

మెగ్నీషియం లోపిస్తే..

శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది. మెగ్నీషియం లోపిస్తే, కండరాల నొప్పులు, పట్టేయడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. మెగ్నీషియం లోపం అధికంగా ఉంటే.. హాపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌, కరోనరీ ఆర్టరీ వ్యాధి, బోలు ఎముకల వ్యాధి ముప్పు పెరుగుతుంది.