Zika Virus: కర్ణాటకలో జికా వైరస్ కలకలం.. వైద్యశాఖ అలర్ట్!

కరోనా వైరస్ భయం నుండి జనాలు బయటకు రాక ముందే మరో వైరస్ కర్ణాటకలో కలకలం రేపింది

  • Written By:
  • Publish Date - December 13, 2022 / 08:37 PM IST

Zika Virus: దేశంలో జికా వైరస్ విజృంభిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. జికా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. తొలుత కేరళలో జికా వైరస్ కేసు బయటపడగా.. ఆ తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోనూ భారీగా నమోదయ్యాయి. తాజాగా కర్ణాటకలో జికా వైరస్ కేసు బయటపడింది. ఓ అయిదేళ్ల బాలికకు జికా వైరస్ సోకిందని, ల్యాబ్ టెస్టులో జికా పాజిటివ్‌గా నమోదైనట్లు కర్ణాటక వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కే.సుధాకర్ స్పష్టం చేశారు.

కొన్ని రోజులుగా డెంగ్యూ, చికెన్ గున్యా వంటి లక్షణాలతో బాలిక బాధపడుతుండటంతో.. టెస్ట్ లు చేయగా జికా వైరస్ సోకినట్లు తేలినట్లు మంత్రి సుధాకర్ తెలిపారు. బాలిక శాంపిల్స్‌ను పూణెలోని ల్యాబ్‌కు రాష్ట్ర వైద్యశాఖ అధికారులు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్టు ఇటీవల రాగా.. బాలికకు జికా పాజిటివ్ గా తేలినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇదే తొలి కేసు అని, ఇప్పటివరకు ఎక్కడా నమోదు కాలేదని తెలిపారు.

జికా వైరస్ లక్షణాలు ఉన్న ఐదుగురి నమూనాలను ల్యాబ్ కు పంపించగా.. ముగ్గురి ల్యాబ్ రిపోర్టులు ఇప్పటివరకు వచ్చినట్లు సుధాకర్ తెలిపారు. ఇద్దరికి నెగిటివ్ అని తేలగా.. ఐదేళ్ల బాలికకు మాత్రమే పాజిటివ్ అని తేలిందని చెప్పారు. దీంతో బాలిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సుధాకర్ స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటుందని, ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి పేర్కొన్నారు.

అయితే జికా వైరస్ అనేది దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఎడెస్ అనే దోమ ద్వారా ఇది వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే ఈ వైరస్ వల్ల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. గర్బిణీ మహిళలకు మాత్రం ఈ వైరస్ వల్ల ప్రమాదం పొంచి ఉందని, కడుపులోకి పిండానికి ఈ వైరస్ ప్రభావం వల్ల ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. 1947లో తొలిసారి ఉగాండాలో జికా వైరస్ ను గుర్తించారు. ఎడెస అనే దోమలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువగా కుడతాయి. వీటి వల్ జికా వైరస్ వ్యాప్తి చెందుతుందని డాక్టర్లు చెబుతున్నారు.