Site icon HashtagU Telugu

Champai Soren : ‘‘మీరొక పులి.. ఎన్డీయేలోకి స్వాగతం’’.. చంపై సోరెన్‌కు ఆహ్వానం

Champai Soren Bjp Foray

Champai Soren : జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నేత చంపై సోరెన్ బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా ఎన్డీయే కూటమిలోని హిందుస్థాన్ ఆవామ్ మోర్చా అధినేత, కేంద్ర మంత్రి జితన్‌రామ్‌ మాంఝీ కీలక వ్యాఖ్యలు చేశారు. చంపై సోరెన్‌ను పులితో పోలుస్తూ ఆయన కొనియాడారు. ‘‘చంపై సోరెన్ గారు మీరొక పులి. ఎల్లప్పుడూ మీరు పులిలాగే ఉంటారు.  ఎన్డీయే కుటుంబంలోకి మీకు స్వాగతం’’ అని పేర్కొంటూ జితన్‌రామ్‌ మాంఝీ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. భారీగా వ్యూస్ వస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

చంపై సోరెన్(Champai Soren) ఆదివారం ఉదయం ఆరుగురు జేఎంఎం ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చేరుకున్నారనే వార్తలు వచ్చాయి. జేఎంఎం వర్గాలు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను సంప్రదించే ప్రయత్నం చేయగా.. అందుబాటులోకి రాలేదని తెలిసింది. ఈ లెక్కన ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి చంపై సోరెన్ బీజేపీలో చేరే అవకాశం ఉందనే విషయం దాదాపుగా స్పష్టమైంది. ఆయనకు బీజేపీలో సముచిత స్థానం ఇచ్చేందుకు హామీ కూడా లభించిందని అంటున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో చంపై సోరెన్ టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. రాబోయే ఒకటి, రెండు రోజుల్లోగా చంపై సోరెన్ భవితవ్యంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read :Flower Seller : తల్లి.. కొడుకు.. ఒక ఐఫోన్.. వైరల్ వీడియో కథ

ఆదివారం రోజు ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘ లేఖను చంపై సోరెన్ విడుదల చేశారు. జేఎంఎంలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి ఆ లేఖలో వివరంగా ప్రస్తావించారు. క్యాబినెట్ సమావేశంలో అకస్మాత్తుగా అందరు మంత్రుల ముందు తనను రాజీనామా అడిగి హేమంత్ సోరెన్ అవమానించారని చంపై సోరెన్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనతో తాను చాలా బాధపడ్డానని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల నుంచి తప్పుకోవడం, కొత్త పార్టీ పెట్టడం, మరో పార్టీలో చేరడం అనే మూడు మార్గాలే తన ఎదుట మిగిలాయన్నారు. అంటే ఆయన జేఎంఎం నుంచి బయటికి రావడం ఖాయమన్న మాట. చంపై సోరెన్ తన ఎక్స్ అకౌంటు నుంచి కూడా జేఎంఎం పార్టీ పేరును తొలగించారు.