Uttar Pradesh: దాదాపు రెండున్నర లక్షలమంది ఉద్యోగుల తమ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదన్న కారణంతో ఉద్యోగులు జీతాల్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. ఉద్యోగులు ఆన్‌లైన్ వేదికగా తమ ఆస్తి వివరాలను ఆగస్టు 31 లోగా వెల్లడించాల్సి ఉంది. అయితే గడువు తేదీలోగా వివరాలను పొందుపరచకపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు మానవ్ సంపద పోర్టల్ను యుపి సర్కార్ ప్రారంభించింది. ఆ పోర్టల్లో ఆగస్టు 31వ తేదీ వరకు ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను తెలపాలని నిబంధన పెట్టింది. అయితే ఇప్పటివరకు 71 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని పోర్టల్లో పొందుపరిచారు. ఇంకా… 2,44,565 మంది ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సి వుంది. అయితే ఆస్తుల వివరాలు వెల్లడించని వారందరికీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆగస్టు నెల జీతాలను నిలిపివేసింది. అన్ని శాఖలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా, ప్రాపర్టీ డిటేల్స్ వెల్లడించని వారి జీతాన్ని హోల్డ్లో పెట్టినట్లు ప్రభుత్వం చెప్పింది.
కాగా, రాష్ట్రంలో మొత్తం 8 లక్షల 46 వేల 640 మంది ఉద్యోగులు ఉన్నారని వారిలో 71 శాతం మంది ఉద్యోగులు వివరాలు వెల్లడించారు. అందిన సమాచారం ప్రకారం కేవలం 6 లక్షల 2 వేల 75 మంది ఉద్యోగులు మాత్రమే తమ చర, స్థిరాస్తుల వివరాలను వెల్లడించారు. అయితే రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, కార్పొరేషన్లు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇందులో చేర్చలేదు. ఉద్యోగులు ఆన్‌లైన్‌లో ఆస్తి వివరాలను అందించకపోతే, వారి జీతాలు విడుదల చేయబడవని వర్గాలు చెబుతున్నాయి.