Site icon HashtagU Telugu

మార్చి 25న రెండోసారి సీఎంగా యోగి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం.. సోనియా, అఖిలేష్‌ల‌కు ఆహ్వానం..?

80

80

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ మార్చి 25న ప్రమాణస్వీకారం చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి మెజారిటీ సాధించేలా కాషాయ పార్టీని నడిపించి చరిత్ర సృష్టించిన యోగి ఆదిత్యనాథ్ మార్చి 25న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

కీలకమైన బీజేపీ నేతలు, కేంద్రమంత్రులతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధ్యక్షుడు, పలువురు కేంద్ర కేబినెట్ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించినట్లు స‌మాచారం. యోగి ఆదిత్యానాథ్ త‌న ప్రత్యర్థి అయిన‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి వంటి ప్రముఖులను ప్రతిపక్ష పార్టీల నుంచి ఆహ్వానించే అవకాశం ఉంద‌ని స‌మాచారం.

మహిళా లబ్ధిదారులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల లబ్ధిదారులను కూడా ఆహ్వానించారు. లక్నోలోని ఏకనా స్టేడియంలో ఘనంగా వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కేబినెట్‌ సభ్యుల పేర్లను బీజేపీ ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటును చూసేందుకు కేంద్ర పరిశీలకుడిగా హోంమంత్రి అమిత్ షా నియమితులయ్యారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కూడా సహ పరిశీలకునిగా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ధారించడంలో అమిత్ షాతో కలిసి ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 నియోజకవర్గాలకు గాను 255 స్థానాల్లో విజయం సాధించి 41.29 శాతం ఓట్లతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంది. రాష్ట్రంలో పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత గత 37 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలిచారు