President Elections : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా !?

మొన్న శరద్ పవార్.. నిన్న గోపాల కృష్ణ గాంధీ.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండలేమని స్పష్టం చేశారు.

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 02:01 PM IST

మొన్న శరద్ పవార్.. నిన్న గోపాల కృష్ణ గాంధీ.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండలేమని స్పష్టం చేశారు. దీంతో మరో వ్యక్తిని ఈ పోటీలో నిలిపేందుకు విపక్షాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయనే సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా. ఈ దిశగా సంకేతాలిస్తూ మంగళవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. “మమతా బెనర్జీ నాకు పార్టీ (తృణమూల్ కాంగ్రెస్)లో మంచి గుర్తింపు ఇచ్చారు. ఓ జాతీయ స్థాయి పదవికి పోటీ చేసేందుకు నేను పార్టీకి దూరం కావాల్సి వస్తోంది. నాపై మమతా బెనర్జీ ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు. విపక్షాల ఐక్యతను చాటి చెప్పే అభ్యర్థిగా నిలవాలనేది నా లక్ష్యం” అని యశ్వంత్ సిన్హా ట్వీట్ లో వ్యాఖ్యానించారు.దీనిపై మరింత స్పష్టత కోసం పలు మీడియా సంస్థలు ఆయనను సంప్రదించగా.. ట్వీట్ లో ప్రస్తావించిన విషయాలకు మించి తానేం చెప్పలేనని స్పష్టం చేశారు. గతంలో కేంద్ర ఆర్థిక, విదేశాంగ మంత్రిగా సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం. 2018 సంవత్సరంలో బీజేపీని వీడిన యశ్వంత్ సిన్హా..తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఉపాధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు.