Wrestlers protest : రెజ్ల‌ర్ల నిర‌స‌న‌కు బ్రేక్‌! కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చ‌ర్చ‌లు.. స‌యోధ్య కుదిరిన‌ట్లేనా?

కేంద్ర మంత్రి సూచ‌న‌తో ఈనెల 15వ తేదీ వ‌ర‌కు నిర‌స‌న‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు భ‌జ‌రంగ్ పునియా మీడియాకు వెల్ల‌డించారు.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 10:30 PM IST

రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యూఎఫ్ఐ) అధ్య‌క్షుడు, బీజేపీ(BJP) ఎంపీ బ్రిజ్ భూష‌ణ్(Brij Bhushan) శ‌ర‌ణ్ సింగ్ పై లైగింక వేదింపుల‌ ఆరోప‌ణ‌లు చేస్తూ కొంద‌రు భార‌త అగ్ర‌శ్రేణి రెజ్ల‌ర్లు(Wrestlers) నిర‌స‌న తెలుపుతున్న విష‌యం తెలిసిందే. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద వీరి నిర‌స‌న కొన‌సాగింది. వీరి ఆందోళ‌న ఉధృతం అవుతున్న క్ర‌మంలో బుధ‌వారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) రెజ్ల‌ర్ల‌ను చ‌ర్చ‌ల‌కోసం మ‌రోసారి ఆహ్వానించారు. గ‌త శ‌నివారం కేంద్ర మంత్రి అమిత్ షాతో రెజ్ల‌ర్లు భేటీ అయ్యారు. వీరి భేటీ ర‌హ‌స్యంగా సాగింది. సుమారు రెండుగంట‌ల పాటు జ‌రిగిన భేటీలో అమిత్ షా నుంచి రెజ్ల‌ర్ల డిమాండ్ల ప‌రిష్కారంపై స్ప‌ష్ట‌మైన హామీ రాక‌పోయిన‌ప్ప‌టికీ.. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతామ‌ని చెప్పిన‌ట్లు రెజ్ల‌ర్లు తెలిపారు. అమిత్ షాతో భేటీ జ‌రిగిన మూడు రోజుల్లోనే కేంద్ర క్రీడా శాఖ మంత్రితో మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు రావాల‌ని రెజ్ల‌ర్ల‌కు ఆహ్వానం అందింది.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత ట్విట‌ర్ వేదిక‌గా చ‌ర్చ‌ల‌కు ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. దీంతో బుధ‌వారం ఉద‌యం రెజ్ల‌ర్లు బ‌జ‌రంగ్ పునియా, సాక్షి మాలిక్ బృందం కేంద్ర మంత్రితో ఆయ‌న నివాసంలో చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. ఈ చ‌ర్చ‌ల్లో మ‌రో అగ్ర‌శ్రేణి రెజ్ల‌ర్ వినేష్ ఫోగట్ పాల్గొన‌క‌పోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, ఆమె ఖాప్ పంచాయత్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హర్యానాలోని తన ఊరు బలాలీకి వెళ్లినందున ఈ మీటింగ్ కు రాలేదని తెలిసింది. ఈ చ‌ర్చ‌ల్లో భాగంగా ఐదు డిమాండ్ల‌ను కేంద్ర మంత్రి వ‌ద్ద రెజ్ల‌ర్లు ప్ర‌స్తావించారు. సుమారు ఆరు గంట‌ల‌పాటు వీరి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలో జూన్ 15 నాటికి ద‌ర్యాప్తును పూర్తిచేసి ఛార్జిషిట్ స‌మ‌ర్పిస్తామ‌ని, అదేవిధంగా భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య జూన్ 30లోపు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని కేంద్ర మంత్రి రెజ్ల‌ర్ల‌కు హామీ ఇచ్చారు. ఐదు డిమాండ్ల‌పై ద‌ర్యాప్తు నివేదిక‌రాగానే మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌రుపుదామ‌ని అప్ప‌టి వ‌ర‌కు నిర‌స‌న ఆపాల‌ని కేంద్ర మంత్రి కోరిన‌ట్లు తెలిసింది.

కేంద్ర మంత్రి సూచ‌న‌తో ఈనెల 15వ తేదీ వ‌ర‌కు నిర‌స‌న‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు భ‌జ‌రంగ్ పునియా మీడియాకు వెల్ల‌డించారు. 15వ తేదీ త‌రువాత ఎలా ముందుకెళ్లాల‌నే అంశంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆమె చెప్పారు. అయితే, త‌మ పోరాటం కేవ‌లం తాత్కాలికంగానే నిలిపివేశామ‌ని, ముగియ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలాఉంటే గ‌త నెల 28న రెజ్ల‌ర్ల ఆందోళ‌న‌లో ప‌లువురి రెజ్ల‌ర్ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. వాటిని ఉప‌సంహ‌రించుకోవాల‌ని మంత్రి వ‌ద్ద రెజ్ల‌ర్లు ప్ర‌స్తావించ‌డంతో అందుకు మంత్రి అంగీక‌రించిన‌ట్లు భ‌జ‌రంగ్ పునియా తెలిపారు. మొత్తానికి అమిత్ షా ఎంట్రీతో రెజ్ల‌ర్లు కొంత వెన‌క్కు త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. అయితే, కేంద్ర మంత్ర హామీ మేర‌కు రెజ్ల‌ర్ల డిమాండ్లు ఎంతవ‌ర‌కు ప‌రిష్కారం అవుతాయో వేచి చూడాల్సిందే.

 

Also Read : Invite To Wrestlers : రెజ్లర్లను మళ్ళీ చర్చలకు ఆహ్వానించిన కేంద్రం