Vinesh Phogat : భారత స్టార్ రెజ్లర్‌గాను, హర్యానా ఎమ్మెల్యేగా కూడా సేవలందిస్తున్న వినేశ్ ఫోగట్ జీవితంలో ఆనందదాయక ఘట్టం చోటు చేసుకుంది. మంగళవారం ఆమె ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ శుభవార్తను వినేశ్ అన్నయ్య హర్విందర్ ఫోగట్ మీడియాతో పంచుకున్నారు. “ఈ ఉదయం వినేశ్ బాబుకు జన్మనిచ్చింది. ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. మా కుటుంబానికి ఇది చిరస్మరణీయ క్షణం” అని హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే వినేశ్‌ను భర్త సోమ్‌వీర్ ఇంటికి తీసుకెళ్లనున్నట్లు, బలాలీ గ్రామంలో ఆమెను, బాబును చూసేందుకు కుటుంబ సభ్యులే కాక ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
Thalliki Vandanam : ‘తల్లికి వందనం’ రెండో జాబితా
వినేశ్ ఫోగట్ ఈ ఏడాది మార్చిలో గర్భం గురించి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. “మా ప్రేమకథలో మరో అందమైన అధ్యాయం మొదలవుతోంది” అంటూ అప్పట్లో చేసిన పోస్ట్ అభిమానుల హృదయాలను తాకింది. ఇప్పుడు ఆ అధ్యాయం నిజంగా కొత్త ఊపును తీసుకొచ్చిందని చెప్పాలి. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్ సమయంలో బరువు నిబంధనలు ఉల్లంఘించి ఫైనల్ రేసు నుంచి అనర్హత పాలవ్వడం వినేశ్‌కు తీరని గాయంగా మిగిలింది. ఆ సంఘటన తన క్రీడా జీవితంలో ఓ తీవ్రమైన మలుపు అని ఆమె చెప్పుకొచ్చారు.
అనంతరం ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరి హర్యానా జులానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెజ్లింగ్ లో ప్రతిభ చూపిన వినేశ్ ఫోగట్ ప్రస్తుతం హర్యానాలో ప్రజాప్రతినిధిగా సేవలందిస్తుండగా, ఇప్పుడు తల్లిగా మరో కొత్త బాధ్యతను స్వీకరించారు. తన భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా రెజ్లర్ కావడం విశేషం. తాజా శిశువు జననంతో ఫోగట్ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.