Railway Track : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి వద్ద ఓ యువతి చేసిన నిర్వాకం స్థానికులను, రైల్వే అధికారులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. నాగులపల్లి-శంకర్‌పల్లి మధ్య రైలు పట్టాలపై సుమారు 7 కిలోమీటర్ల దూరం కారు నడిపింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయాయి.
పట్టాలపై కారు ప్రయాణిస్తుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. కారును అడ్డగట్టే ప్రయత్నం చేయగా, యువతి చాకుతో బెదిరించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో అదే మార్గంలో వస్తున్న ఓ రైలు లోకో పైలట్ దృశ్యాన్ని గుర్తించి, అప్రమత్తంగా రైలు ఆపేశాడు. దాంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న శంకర్‌పల్లి పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని యువతిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, పట్టాలపై కారు నడిపిన వ్యక్తిని లఖ్‌నవూ నివాసితురాలు రవికా సోనిగా గుర్తించారు. ఆమె గతంలో హైదరాబాద్‌లోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిందని సమాచారం. అయితే ఇటీవల ఉద్యోగం కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన వెనక ఆమె మానసిక స్థితి దెబ్బతిందా? లేక డ్రగ్స్ ప్రభావమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి రవికా సోనిని చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆమె నిర్వాకంతో సుమారు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Vice-President Dhankhar: భారత ఉపరాష్ట్రపతికి అస్వస్థత.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?