Site icon HashtagU Telugu

Congress Revamp: పీసీసీ చీఫ్ ల సస్పెన్షన్ తో కాంగ్రెస్ లో ప్రక్షాళన పూర్తయ్యిందా? మొదలైందా?

congress working committee

congress working committee

137 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ముఖం చెల్లడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు ‘నా మాటే శాసనం’ అని శివగామి రేంజ్ లో హవా చెలాయించిన పార్టీ.. ఇప్పుడు దేశం మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో తప్ప అధికారంలోనే లేదు. ఇలాంటి సమయంలో సోనియాగాంధీ రంగంలోకి దిగారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను రాజీనామా చేయమని ఆదేశించారు. కానీ దీనితో ఫలితమెంత?

ఇంత పెద్ద నిర్ణయాన్ని సోనియా తీసుకుంటారని పార్టీ వర్గాలు అస్సలు ఊహించలేదు. ఇందులో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. రాజీనామా ఎపిసోడ్ లో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ జ్యోత్ సింగ్ సిద్దూ ఉండడం. ఎన్నికల్లో పార్టీ ఓడితే ఓడింది కానీ.. ఇన్నాళ్లకైనా పీసీసీలను పునర్వ్యవస్థీకరించడానికి అధిష్టానం నడుం బిగించింది అన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. కానీ ఇక్కడ సమస్య కేవలం పీసీసీ చీఫ్ లతోనే అనుకుంటే సరికాదు. హైకమాండ్ లో ఉన్న కొందరు సీనియర్ వృద్ధ నేతల రూటు మారకపోతే.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా మారదన్నది నిజం.

ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్. ఉత్తరాఖండ్, గోవా ఉన్నాయి. ఇప్పుడీ ఐదు రాష్ట్రాల్లో పార్టీని ఎలా ప్రక్షాళన చేస్తారన్నదానిపైనే త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే.. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలంటే హస్తవ్యస్తమైన పార్టీని ఇప్పటి నుంచి క్లీన్ చేయాల్సిందే. పటిష్టమైన నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాల్సిందే. కానీ ఆ జీ-23 నిరసనగళం.. సోనియా కుటుంబాన్ని ప్రశాంతంగా ఆలోచించనిస్తుందా?

కాంగ్రెస్ ప్రక్షాళనలో ప్రియాంకగాంధీ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ కూడా పూర్తిస్థాయిలో యాక్టివ్ అయితే.. కచ్చితంగా పార్టీకి మళ్లీ పునరుత్తేజం వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. క్యాడర్ ఉన్నా లీడర్ లేని పార్టీగా మిగిలిపోతుందో.. లేకపోతే.. ఎన్నిమిదేళ్ల కిందట ఉన్న పవర్ ను మళ్లీ చూపిస్తుందో అన్నది త్వరలోనే తేలుతుంది.

Exit mobile version