Karnataka: కర్ణాటక నుంచి ఔట్.. బెడిసికొట్టిన బీజేపీ ‘మిషన్ సౌత్’

కర్ణాటక పోల్స్ (Karnataka Polls)లో బీజేపీ (BJP)కి తగిలిన ప్రకంపనలు.. యావత్ దక్షిణ భారతదేశంలో దాని ఉనికిని ప్రశ్నార్ధకంగా మార్చే ఛాన్స్ ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

  • Written By:
  • Updated On - May 14, 2023 / 12:38 PM IST

దినేష్ ఆకుల

కర్ణాటక పోల్స్ (Karnataka Polls)లో బీజేపీ (BJP)కి తగిలిన ప్రకంపనలు.. యావత్ దక్షిణ భారతదేశంలో దాని ఉనికిని ప్రశ్నార్ధకంగా మార్చే ఛాన్స్ ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కమల దళానికి ఎదురైన ఈ ఓటమితో దక్షిణాదిలోని కాంగ్రెస్ (Congress) శ్రేణుల్లో మళ్ళీ జోష్ వచ్చింది. ఈ జోష్ ముందు.. దక్షిణ భారత్ రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయి క్యాడర్ అంతంత మాత్రమే ఉన్న బీజేపీ నిలబడే పరిస్థితులు ఉండకపోవచ్చని అంటున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి ఇతర దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ విస్తరణకు కర్ణాటక ఓటమి బ్రేక్ వేయనుందని చెబుతున్నారు. ఇతర పార్టీల ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు ఇక ఆసక్తి చూపే అవకాశాలు తగ్గిపోతాయనే అభిప్రాయం పొలిటికల్ అనలిస్టుల్లో వ్యక్తం అవుతోంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు వేదికగా మారిన మొదటి రాష్ట్రము కర్ణాటక.. అక్కడే అది చతికిలపడటం అనేది ఆ పార్టీ ఫ్యూచర్ లో ఎదుర్కోబోయే నెగెటివ్ రిజల్ట్స్ కు స్పష్టమైన సంకేతంలా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.

ఫోకస్ తెలంగాణ

దక్షిణ భారతదేశంలోని మరో ముఖ్యమైన రాష్ట్రం తెలంగాణ. ఇందులో ఈ ఏడాది చివరికల్లా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కర్ణాటకలో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే .. తెలంగాణలోని బీజేపీ కార్యకర్తల మనోధైర్యం పెరిగి ఉండేది. కానీ అలా జరగలేదు. రివర్స్ ఫలితం రావడం.. తెలంగాణ బీజేపీ క్యాడర్ ను నెగెటివ్ మూడ్ లోకి నెట్టాయి. తెలంగాణా ఒక్కటే కాదు.. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులలోనూ ఇప్పుడు కమల దళం నిరాశలో కూరుకుపోయింది. ఫలితంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చిన ‘మిషన్ సౌత్’కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Also Read: Karnataka Elections 2023 : క‌ర్ణాట‌క‌లో 300 కంటే త‌క్కువ ఓట్ల‌తో విజ‌యం సాధించిన అభ్య‌ర్థులు వీరే..!

ఐదు రాష్ట్రాల 129 లోక్‌సభ స్థానాలు కీలకం

2024లో లోక్ సభ ఎన్నికలలో మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే.. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల పాత్ర కీలకమైంది. ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 129 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఈ 129 మంది ఎంపీల పాత్ర చాలా కీలకం కానుంది. ఈ రాష్ట్రాల్లో బలపడటం ద్వారా బీజేపీ ఒకే దెబ్బతో అనేక లక్ష్యాలను చేధించాలని భావించింది.

కానీ ఆ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. జయలలిత మరణానంతరం తమిళనాడులో ఆమె పార్టీ అన్నాడీఎంకే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పటికీ, ప్రతిపక్షంలో బలమైన నాయకుడు లేడని బీజేపీ భావిస్తోంది. అందువల్ల అక్కడ తమకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అనుకుంటోంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణలో భాగంగా తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు ఉన్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది.