Sajith Premadasa : లంకకు కాబోయే అధ్యక్షుడు ఆయనేనట !?

ఆర్ధిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంక మళ్లీ గట్టెక్కాలంటే ఒకే మార్గం ఉంది.

  • Written By:
  • Publish Date - July 15, 2022 / 09:00 AM IST

ఆర్ధిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంక మళ్లీ గట్టెక్కాలంటే ఒకే మార్గం ఉంది. అదే.. బలమైన, దార్శనికత కలిగిన రాజకీయ నాయకత్వం. ప్రస్తుతానికి దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా .. ప్రధాని రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 20న శ్రీలంక పార్లమెంటులో అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు దానిపైనే ఉంది. ఎందుకంటే శ్రీలంకలో అధ్యక్షుడి అధికారాల పరిధి చాలా ఎక్కువ. అటువంటి కీలక స్థానానికి ఎన్నికయ్యే వ్యక్తి మాత్రమే.. దేశానికి సంబంధించిన విధాన నిర్ణయాలను తీసుకోగలుగుతాడు.

అధ్యక్ష రేసులో ఎవరెవరు ?

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల గురించి తెలుసుకునే ముందు.. అక్కడి పార్లమెంటులో వివిధ పార్టీల బలాబలాల గురించి తెలుసు కోవాలి. లంక పార్లమెంటు లో మొత్తం 225 సీట్లు ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీట్ల (113) ను సాధించిన వారే అధ్యక్ష పీఠంపైకి ఎక్కుతారు. రాజపక్స ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీ నేతృత్వంలోని కూటమికి ప్రస్తుతం 103 మంది ఎంపీల బలమే ఉంది. మరో 43 మంది స్వతంత్ర ఎంపీలు కలిసి ఒక చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎస్జేబీ పార్టీ నేతృత్వంలోని కూటమికి 53 మంది ఎంపీల బలం ఉంది. దీనికి సీనియర్ రాజకీయ నేత సజిత్ ప్రేమదాస నేతృత్వం వహిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ తో ఆయన పని చేస్తున్నారు. 43 మంది స్వతంత్ర ఎంపీల మద్దతు కూడగట్టే యత్నాల్లో ఉన్నారు. ఒకవేళ స్వతంత్ర ఎంపీలు మద్దతు పలికితే అధ్యక్ష పదవి రేసులో సజిత్ ప్రేమదాస హాట్ ఫెవరేట్ గా మారతారు. 53 సొంత పార్టీ ఎంపీలు, 43 స్వతంత్ర ఎంపీలు కలిసి మొత్తం ఎంపీల మద్దతు 96కు చేరుతుంది. ఇక తమిళ్ నేషనల్ అలయన్స్ కు చెందిన 10 మంది ఎంపీలు కూడా సజీత్ కే మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధ్యక్ష ఎన్నికల రేసులో ఆయనకు లభించే ఓట్ల సంఖ్య 106 కు చేరే ఛాన్స్ ఉంది. అదే జరిగితే.. రాజపక్స కుటుంబ పార్టీ కంటే మెజారిటీని సజీత్ ప్రేమదాస సాధిస్తారు. ఇవన్నీ ఇలాగే జరిగితే ఆయనకు అధ్యక్ష పీఠం దక్కడం నల్లేరు మీద నడకే అవుతుంది.