No More Congress: జీవితంలో ఇంకెప్పుడూ కాంగ్రెస్ తో పనిచేయను : పీకే

భవిష్యత్ లో మరెన్నడూ కాంగ్రెస్ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పారు.

  • Written By:
  • Publish Date - May 31, 2022 / 09:51 PM IST

భవిష్యత్ లో మరెన్నడూ కాంగ్రెస్ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పారు. తన ట్రాక్ రికార్డు లో ఓటమి అనే పదానికి బీజం వేసింది కాంగ్రెసేనని ఆయన ఆరోపించారు. ” గత పదేళ్ళలో నేను 11 ఎన్నికలకు రాజకీయ వ్యూహాలు అందించాను. అయితే కేవలం ఒకే ఒకసారి ప్రతికూల ఫలితాలు చూశాను.

అది కూడా కాంగ్రెస్ వల్లే. 2017లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పనిచేసి తప్పు చేశాను” అని పీకే వ్యాఖ్యానించారు. తన గెలుపుల రికార్డును పటాపంచలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. “2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తో, 2015 లో జేడీయూ తో, 2017 లో పంజాబ్ ఎన్నికల్లో, 2019 లో వైఎస్ జగన్ తో, 2020 లో అరవింద్ కేజ్రీవాల్ తో, 2021లో మమతా బెనర్జీ, స్టాలిన్ లతో కలిసి పనిచేశాను.

వాళ్లకు అధికార పీఠాలు దక్కడంలో కీలక పాత్ర పోషించాను” అని తన సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు గురించి పీకే వివరించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మదన్ మోహన్ ఝా మండిపడ్డారు. “కాంగ్రెస్ వల్లే పీకే ట్రాక్ రికార్డు దెబ్బతిని ఉంటే.. సీనియర్ కాంగ్రెస్ నేతల చుట్టూ ఆరేడు రోజులు తిరిగి ప్రజెంటేషన్ ఎందుకిచ్చినట్టు ?” అని ప్రశ్నించారు.